బాలలపై ప్రేమ చూపాలి
● పని నుంచి విముక్తి కల్పించి, బడిలో చేర్పించాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/విద్యానగర్: బాలలపై ప్రేమ, వాత్సల్యం చూపాలని, వారికి పని నుంచి విముక్తి కల్పించి, బడిలో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని చిన్న పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, క్వారీలు, అపార్ట్‌మెంట్లు తదితర ప్రదేశాల్లో శిశు సంక్షేమ, కార్మిక శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ.. రేపటి తరం బాగుండాలంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అనంతరం ఆపరేషన్ స్మైల్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్‌వో పవన్‌కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, డీడబ్ల్యూవో సబిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, డీసీఎల్ శామ్యూల్, సీఐ రవీందర్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డీఈవో జనార్దన్‌రావు, డీసీపీవో పర్వీన్, సీడీపీవోలు పాల్గొన్నారు.
సైన్స్‌ను అన్వయించుకోవాలి
జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాల విజేతలకు బహుమతి ప్రదానోత్సవాన్ని మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. సైన్స్‌ను నిత్య జీవితంలో అన్వయించుకోవాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిన రత్నం గ్లోబల్ హైస్కూల్‌కు బహుమతి ప్రదానం చేశారు. డీఈవో జనార్దన్‌రావు, వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు బీఎన్.రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్, మహేందర్, జిల్లా బాధ్యులు ఆర్.వెంకటేశ్వరరావు, కె.శంకర్, ఎన్.దేవేందర్, రత్నం హైస్కూల్ కరస్పాండెంట్ రత్నమయ్య తదితరులున్నారు.
ఆల్ఫా–ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవీ సంస్థాన్ ఎన్జీవో ద్వారా గంగాధర మండలంలోని 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆల్ఫా–ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి శిక్షణ ప్రణాళికపై ఎన్జీవో ఆర్గనైజర్ సునీతాగాంధీ కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో జనార్దన్‌రావులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణకు దేవీ సంస్థాన్ సంస్థ ముందుకు వచ్చిందని, 45 రోజుల పాటు కోచింగ్ సహా స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తారని తెలిపారు. విద్యాశాఖ క్వాలిటీ కో–ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గంగాధర ఎంఈవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment