ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
జన్నారం(ఖానాపూర్): ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జన్నారం గ్రామ పంచాయతీకి చెందిన ఆటో సోమవారం జన్నారం నుంచి టీజీపల్లికి వెళ్తుండగా భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో నిర్మల్ డిపోకు చెందిన బస్సు ఆటోను ఓవర్‌టెక్ చేయబోయి వెనుకనుంచి ఢీకొట్టింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తనుగుల తిరుపతి, ప్రయాణికులు గంగవ్వ, స్రవంతి, హర్థికకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను లక్సెట్టిపేట ఆస్పత్రికి తరలించారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామకృష్ణాపూర్: రవీంద్రఖని రైల్వేస్టేషన్లో సోమవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. మృతునికి 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నలుగురి బైండోవర్
భీమిని: కోడిపందేలు నిర్వహిస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను సోమవారం డెప్యూటీ తహసీల్దార్ జోగయ్య ఎదుట బైండోవర్ చేసినట్లు కన్నెపల్లి ఎస్సై గంగారాం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గతంలో కోడిపందేలు నిర్వహిస్తూ పట్టుబడిన మహేందర్, రాజేశ్, మల్లేశ్, వెంకటేష్‌ను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంలాంటివి ఆడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యక్తిపై కేసు నమోదు
కుభీర్(ముధోల్): మద్యం మత్తులో 100కు కాల్‌చేసిన వ్యక్తిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పీ.రవీందర్ తెలిపారు. మండలంలోని మాలెగాం సమీపంలో ఆదివారం రాత్రి నలుగురు వ్యక్తులు రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు దీపక్, ఆత్మరాం వారిని సముదాయించిి స్వగ్రామమైన సాంవ్లికి పంపించారు. అందులో రోహిత్ అనే వ్యక్తి తాగిన మైకంలో పదేపదే 100కు కాల్‌చేసి పని పేరు చెప్పకుండా విసిగించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
హత్య కేసులో ఇద్దరి రిమాండ్
ముధోల్: హత్య కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సంజీవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముధోల్‌కు చెందిన కరుణ్ ఇటీవల హత్యకు గురికాగా అతని భార్య ఫిర్యాదు మేరకు మృతుని తండ్రి ఏఎస్సై రాందాస్, బావ కానిస్టేబుల్ అనిల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
యువకుడి అదృశ్యం
నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన ఓల్లెపు సాయన్న ఈ నెల 4న పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. గత మంగళవారం నుంచి ఆచూకీ లభించకపోవడంతో అతని తండ్రి ఓల్లెపు హనుమంతు సోమవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 7989883565 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment