సాగుకు సున్నం..
అన్నదాతను విస్మరించిన కూటమి ప్రభుత్వం
● ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన సర్కారు ● గత ప్రభుత్వ ‘రైతు భరోసా’ ఎత్తివేత.. ఆర్బీకేలు నిర్వీర్యం ● పంట నష్టంలో కోత.. రైతులకు వాత ● ధాన్యం కొనుగోళ్లలో మెలిక.. రైతుల ఆందోళన ● దగా పడ్డ రైతన్నల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆందోళన బాట ● నేడు ర్యాలీ, ధర్నా, కలెక్టర్‌కు వినతి పత్రం అందించనున్న పార్టీ శ్రేణులు
సాక్షి, మచిలీపట్నం/గుడ్లవల్లేరు: ఎన్నికల ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విస్మరించడం ఆయనకే చెల్లుతోంది. చేస్తోంది మోసమే అయినా.. కారణం మాత్రం ఇతరుల పైనో.. ఖజానా పైనో వేస్తారు.. తాము చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటారు. పదే పదే అదే చెప్పి నమ్మిస్తారు. కాలయాపనతో పుణ్య కాలం పూర్తి చేస్తారు. ఆయనే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ సారి కూడా రైతన్నలను దగా చేశారు.
వ్యవ‘సాయం’ మరచిన కూటమి..
గతంలో లాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ సారి కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. ముఖ్యంగా సూపర్ సిక్స్‌లో భాగమైన రైతుకు ఏటా రూ.20 వేల సహాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరునెలలు గడిచినా దాని ఊసే లేదు. దీంతో పాటు ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం కూడా లేదు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేర్లు మార్చారు తప్ప అక్కడ ధాన్యం కొనుగోలు లేదు. కనీసం ఖాళీ సంచులు సక్రమంగా సరఫరా చేయలేదు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, దళారుల హవా నడుస్తున్నా పట్టించుకోలేదు. దీంతో గత నెలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆయనను బహిరంగంగానే నిలదీశారు. జిల్లా ఖరీఫ్ సీజన్‌లో 1.41లక్షల హెక్టార్లు సాగుచేశారు. ఇందులో వరదల కారణంగా 44,521 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లగా వాటికి రూ.385.24 కోట్లు, 4,070 హెక్టార్లలో ఉద్యాన పంటలకు రూ.107.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే పరిహారంలో సగానికి పైగా కోత పెట్టారు. ఇటీవలే తుపాను కారణంగా ధాన్యం తడిచినా.. పట్టించుకోలేదు. తేమ శాతం పేరుతో మెలిక పెట్టారు. 1262 రకం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధర్నా చేశారు.
నాడు రైతుల పక్షాన..
రైతుల సంక్షేమం, సేవలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా పెట్టుబడి కోసం ఏటా రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించింది. రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన అనేక సేవలు ఉన్న ఊరికే తెచ్చింది. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, ఖాళీ సంచులు, సూచనలు, సలహాలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల సిబ్బందిని నియమించింది. గత ఐదేళ్లలో రైతు భరోసా కింద 1,72,821 మంది రైతులకు రూ.777.60 కోట్లు, 85,909 మందికి ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.69.43కోట్లు, 58,595 మందికి క్రాప్ ఇన్సూరెన్స్ రూ.128.85కోట్లు, 18,229 మత్స్యకార రైతులకు రూ.44.13 కోట్లు అందించింది.
కన్నీటి గట్టున కర్షకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.. చేతికందిన పంట ఫెంగిల్ పేరిట వచ్చిన తుపాను తన్నుకుపోతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో దయనీయంగా కూర్చున్నాడు.. తేమ పేరుతో మిల్లర్లు కోత పెడుతుంటే, చర్యలు తీసుకుంటుందేమో అని కోతల కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూశాడు. కనీసం మద్దతు ధర కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ మొరపెట్టుకున్నాడు. చివరికి రోడ్డెక్కి ఆందోళనలు చేశాడు. అయినప్పటికీ కాఠిన్యాన్ని ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం వారి ఆక్రందనలను పట్టించుకోలేదు. ఈ సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment