మామిడి రైతుల ఇబ్బందులు పరిష్కరిస్తాం
పెద్దకొత్తపల్లి: మామిడి తోటలు సాగు చేసిన రైతులకు మండలంలోని కల్వకోల్‌లో ఉద్యానవన శాఖ, ఏపీఈడీఏ ఆధ్వర్యంలో తోటల నిర్వహణపై జిల్లా హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏజీఎం నర్సయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసిందన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు అవుతున్నాయని, దీంతో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను మెగా క్లస్టర్‌గా కేటాయించిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం మామిడి పంటకు ముందు, పంట దశలో కోత అనంతరం సంబంధించిన యాజమాన్య చర్యలు సకాలంలో చేపడుతూ మామిడి విలువ ఆధారిత ఉత్పత్తులను పెంపొందించడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ రవాణా, మార్కెటింగ్, బ్రాండింగ్ విలువలను పెంచుతూ దేశ, విదేశీయ మార్కెట్లలో రైతులు మామిడి పండ్లను అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 53 ఉద్యాన క్లస్టర్లను గుర్తించగా పైలెట్ బేసిన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసిందన్నారు. కొల్లాపూర్ మామిడికి ఎంతో గుర్తింపు ఉందన్నారు. పాలెం ఉద్యానవన శాస్త్రవేత్త జ్యోతి మాట్లాడుతూ మామిడి రైతులు నెలవారిగా తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఎరువులు, చీడపీడల నివారణ, నీటి తడులు, పూత, పిందె దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఈడీఏ అధికారి భాషా, ఉద్యానవన అధికారి లక్ష్మణ్, ఏఓ శిరిష, ఏఈఓలు సుధ, అజయ్, మామిడి రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment