నల్గొండ: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మున్సి పాలిటీలో నివాసముంటున్న ధీరావత్ వీర్యానాయక్, శ్రీదేవి(33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, సాత్విక్ ఉన్నారు. వీర్యానాయక్ పెంచికల్‌దిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీదేవి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీర్యానాయక్ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి తలుపులు ఎంత కొట్టినా శ్రీదేవి తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపులు పగులకొట్టగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. శ్రీదేవి రాసిన సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తి పంపకాలే కారణమా..?
శ్రీదేవి తల్లిదండ్రులు బిక్య హరిలాల్, కమ్మలమ్మ పెన్‌పహాడ్ మండలం గుడిబండతండాలో ఉంటున్నారు. శ్రీదేవి చెల్లెలు సునీత సూర్యాపేటలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. కాగా అక్కాచెల్లెళ్ల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలకు సంబంధించి గొడవలు జరగుతున్నాయని, ఈ విషయంలో తన తల్లిదండ్రులు సైతం తన చెల్లెలు సునీతకే సపోర్ట్ చేస్తుండడంతో శ్రీదేవి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త వీర్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment