భూ సమస్యలకు మోక్షం
ధరణి స్థానంలో ‘భూభారతి’ తెస్తున్న ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ సమస్యలకు మోక్షం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూ భారతి (ఆర్‌ఓఆర్) –2024 బిల్లు త్వరలోనే చట్టం కానుంది. ఈ చట్టం అమలైతే భూ సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. మొన్నటి వరకు ఉన్న దరణితో ఎలాంటి భూ సమస్య ఉన్నా దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్‌కు వచ్చేది. వందలాది సమస్యల దరఖాస్తులు కలెక్టర్ లాగిన్‌లో ఉండేవి. సీరియల్ పద్ధతిన ఆ సమస్య తీవ్రతను బట్టి కలెక్టర్ పరిష్కరించేవారు. దీంతో చాలా జాప్యం జరిగేది. ప్రస్తుతం తీసుకొస్తున్న భూ భారతి చట్టం ద్వారా జిల్లా స్థాయిలోనే నాలుగు అంచెల్లో అంటే.. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో మొత్తంగా జిల్లాలోనే భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. అత్యంత క్లిష్టమైన సమస్యలను మాత్రం సీసీఎల్‌ఏ స్థాయిలో పరిష్కరించనున్నారు.
జిల్లాస్థాయిలో నాలుగు అంచెల్లో..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూ భారతి చట్టం ద్వారా నాలుగు అంచెల్లో సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడింది. మండలస్థాయిలో తహసీల్దార్‌కు కొన్ని బాధ్యతలు, ఆ తర్వాత డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు మరికొన్ని, ఆపై కొన్ని సమస్యలను అదనపు కలెక్టర్‌కు ఇంకా ముఖ్యమైన సమస్యలు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో 7 వేలకు పైగా పెండింగ్ సమస్యలు ఉండగా, 13 వేలకు పైగా సాదాబైనామాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటినికి భూభారతిలో పరిష్కారం లభించనుంది.
తహసీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యేవి..
● టీఎం–4 మాడ్యూల్‌లో ఫౌతి చేయడం.
● అసైన్డ్ భూములను కూడా ఫౌతి చేసే అధికారం.
● మాడ్యూల్ టీఎం–10 పరిధిలో జీపీఏ, ఎస్‌పీఏ అమలు చేయడం.
● మాడ్యూల్ టీఎం–14లో ఆధార్ తప్పిదాలను సరి చేయడం, ఆధార్ లేని వాటిని సరి చేయడం, భర్త, తండ్రి పేర్లు తప్పుగా ఉంటే సరి చేయడం, ఫొటో మిస్ మ్యాచింగ్, జెండర్ తప్పిదాలు, కులం తప్పుగా పడినా, సర్వే నంబర్ తప్పుగా పడినా వాటిని సరి చేయడం.
● మాడ్యూల్ టీఎం–32 ఖాతాల విలీనం కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడం.
ఆర్డీఓ స్థాయిలో..
● మాడ్యూల్ టీఎం–7 పరిధిలో పాస్‌బుక్‌లు లేకుండా నాలా కోసం వచ్చిన దరఖాస్తుల పరిష్కరం.
● కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించిన ఫిర్యాదులు, ఎన్‌ఆర్‌ఐ పోర్టల్, టీఎం–22 మాడ్యూల్ పరిధిలో ఉన్న ఏదేని సంస్థ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తుల పరిష్కారం.
● పెండింగ్‌లో ఉన్న నాలా దరఖాస్తుల పరిష్కారం.
● రూ.5 లక్షలలోపు వ్యాల్యూ ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్లు, రూ.5 లక్షల లోపు విలువ కలిగిన విస్తీర్ణాన్ని సరి చేయడం.
అదనపు కలెక్టర్ స్థాయిలో..
● టీఎం–3 మాడ్యూల్ పరిధిలో మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ చేయడం.
● టీఎం–24 మాడ్యూల్ పరిధిలో కోర్టు ఆర్డర్ ఆధారంగా పట్టాదార్ పాస్ పుస్తకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిష్కారం.
● పట్టాదారు పాస్‌బుక్ లేదా నాలా మార్పడి వంటి వాటిల్లో పేరు, ఇంటి స్థలం తప్పుగా చూపిన వాటి సమస్యల పరిష్కారం.
● పేరు మార్పుపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం.
ఫ జిల్లాస్థాయిలో నాలుగు అంచెల్లో పరిష్కారం
ఫ తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే ఎక్కువ శాతం..
ఫ క్లిష్టమైన సమస్యలకు సీసీఎల్‌ఏ పరిధిలోనే..
ఫ జిల్లాలో 7 వేలకుపైగా పెండింగ్ దరఖాస్తులు
సీసీఎల్‌ఏ పరిధిలో..
అన్ని రకాల నోషనల్ ఖాతా నుంచి పట్టాను బదిలీ చేయడం.
భూముల రకాల్లో తప్పుపడిన వాటిని సరి చేయడం.
ఎంజాయ్‌మెంట్‌లో పొరపాట్లను సరిచేయడం.
రూ.50 లక్షల విలువ ఉన్న వాటి పరిధిలోని విస్తీర్ణాన్ని సరిచేయడం.
రూ.50 లక్షలకు పైగా విలువైన భూమికి సంబంధించిన మిస్సింగ్ సర్వే నంబర్, సబ్ డివిజన్ల మార్పునకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం.
కలెక్టర్ స్థాయిలో..
మాడ్యూల్ టీఎం–15 పరిధిలో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడానికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం.
పట్టాదారు పాస్‌బుక్, సెమీ అర్బన్ ల్యాండ్ కోసం వచ్చిన దరఖాస్తులు, ధరణి కంటే ముందు కొంత భూమి అమ్మి ఆ తర్వాత పాస్‌బుక్‌లు జారీ కాని సమస్యలను పరిష్కరిస్తారు.
ధరణి కంటే ముందు నాలా భూమి నుంచి వ్యవసాయ భూమిగా మార్పిడి జరిగిన వాటికి సంబంధించిన ఫిర్యాదులు.
రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు విలువ ఉన్న భూములకు సంబంధించి విస్తీర్ణాన్ని సరి చేయడం.
Comments
Please login to add a commentAdd a comment