3న జిల్లాస్థాయివిద్య వైజ్ఞానిక ప్రదర్శన
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శన ఈ నెల 3, 4న నిర్వహించనున్నట్లు డీఈఓ గోవింద్‌రాజులు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్పియల్, అన్ని మేనేజ్‌మెంట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు తమ విద్యార్థులను సిద్ధం చేయాలని, 6, 7, 8వ తరగతులు జూనియర్ విభాగంలో ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి, ఒక గైడ్ టీచర్ పాల్గొనాలని, 9,10 తరగతులు సీనియర్ విభాగంలో వివిధ విభాగాలలో ప్రతి పాఠశాల నుండి రెండు ప్రాజెక్ట్‌లు, ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు పాల్గొనాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ కళాశాలలో ఈ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: 21 రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపాల్ పార్క్ దగ్గర ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోది. బుధవారం పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ, మండల వనరుల కేంద్రాలు, ఉన్నల పాఠశాల, భవిత కేంద్రాలలో చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని, వారిని క్రమబద్ధీకరించి విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. రెండు రోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలతో చర్చలు విఫలమైనందున వారు సమ్మె కొనసాగిస్తున్నారని, వీలైనంత త్వరగా వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు శ్రీనివాస్, రఘువీర్, తిప్పన్న, ఫజీల్, విజయ్‌కుమార్, మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తాం
అలంపూర్: డీసీసీబీ బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తామని ఆ బ్యాంక్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అలంపూర్ పీఏసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్‌ల ద్వారా ఈ ఏడాది రూ.1550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఐదుఎకరాల పొలం ఉన్న రైతులకు కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షలు, మార్టిగేజ్ లేకుండా రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులకు ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షలు, గ్రామాల పరిధిలో ఉన్న రైతులకు ఇంటి కోసం రూ.15 లక్షల వరకు రుణాలు ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడైనా చదువుకోవడానికి రైతు బిడ్డలకు రూ.10 లక్షలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ.35 లక్షల వరకు రుణ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. రైతులకు బంగారంపై 15 నిమిషాల్లో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.2 లక్షల రుణ మాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
కురుమూర్తిస్వామి సన్నిధిలో భక్తుల సందడి
చిన్నచింతకుంట: నూతన సంవత్సరం పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలం అమ్మపురం కురుమూర్తిస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్యూలైన్లలో ప్రజలు బారులుతీరారు. కొందరు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు స్వామివారికి దాసంగాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment