బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు
చల్లపల్లి: మండలంలోని పాగోలు శివారు మేకావారిపాలెం వద్ద నడకుదురు రోడ్డుపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోదెలోకి పల్టీ కొట్టింది. అవనిగడ్డ డిపో నుంచి విజయవాడ బయలుదేరిన కరకట్ట ఎక్స్‌ప్రెస్ బస్సు మేకావారిపాలెం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి కుడివైపునకు దూసుకెళ్లి పంట బోదెలోకి పల్టీ కొట్టింది. వ్యవసాయ కూలీలు ప్రయాణికులను బయటకు లాగారు. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా నలుగురు గాయపడ్డారు. ప్రమాదంలో హైదరాబాద్ నుంచి మోపిదేవి గుడికి వచ్చి విజయవాడ బయలుదేరిన జొన్నలగడ్డ జోత్స్న తలకు, కుడి భుజానికి గాయమైంది. మోపిదేవి నుంచి దేవరపల్లికి బయలుదేరిన కోసూరు శివరామప్రసాద్ కుడి చేతికి గాయమైంది. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు సాలిపేట నుంచి విజయవాడ బయలుదేరిన వృద్ధురాలు జిన్నాబత్తిన కమల గాయపడింది. మరో మహిళ స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్‌ఐ సీహెచ్.చినబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే పరామర్శ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరన్నారు. వీరికి మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులకు సూచించారు.
నలుగురికి గాయాలు ఎమ్మెల్యే సింహాద్రి పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment