విస్త్రృత ప్రజాప్రయోజనాలే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తు ప్రాజెక్టులు, వాటిని చేపట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, దక్షిణ మధ్య రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ, జల వనరుల అభివృద్ధి, డ్రెయిన్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా మంజూరైన పనులు, వాటిలో పురోగతి, భవిష్యత్తులో చేపట్టబోయే పనులు తదితరాలపై సమీక్షించారు. వివిధ పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) త్వరితగతిన రూపొందించాలని, ఇందుకు అవసరమైన ఉమ్మడి తనిఖీల ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. రైల్వేతో సంబంధమున్న పనుల పూర్తికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమృత్ భారత్ పథకం కింద నిధులు మంజూరు, సత్తెనపల్లి–కొంపల్లి రైల్వే లైను తదితరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జ్, సింగ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, వాంబే కాలనీ వద్ద డబుల్ లైన్ రైల్వే అండర్ బ్రిడ్జ్, మధురానగర్ పప్పుల మిల్లు వద్ద డబుల్ లైన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదితరాలపై సమావేశంలో చర్చించారు. వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్ గేట్లు రీప్లేస్‌మెంట్, జి.కొండూరు తారకరామ ఎత్తిపోతల పథకానికి మోటార్లు సమకూర్చే అంశంపైనా ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, సీపీవో వై.శ్రీలత, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్‌తో పాటు రైల్వే, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment