100 ఎకరాల భూమి కొట్టేసేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి యత్నం!
ఆ భూమి చేతికొచ్చాక మళ్లీ చేతులు మారేలా ప్రైవేట్ వ్యక్తులతో డీల్
మల్లవల్లిలో భూముల ధర ఎకరం రూ.కోటికి పైనే..
ప్రభుత్వ ధర రూ.18 లక్షలు చెల్లించి దండుకునేందుకు సన్నాహాలు
పేదలకు మరోచోట భూమి కేటాయిస్తామని మభ్యపెట్టే యత్నం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల స్థలాలు, సామాజిక అవసరాలకు కేటాయించిన భూమిని ‘పచ్చ’గద్దలు తన్నుకుపోనున్నాయి. సుమారు రూ.100 కోట్ల విలువచేసే ఈ భూమిని కారుచౌకగా కొట్టేసేందుకు భారీ స్కెచ్చే వేశారు. పారిశ్రామిక అవసరాల పేరిట ఈ భూమిని లాక్కుని అస్మదీయులకు అప్పగించడానికి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ మొత్తం బాగోతంలో టీడీపీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు ప్రైవేట్ వ్యక్తులతో ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ భూమికి బదులుగా గ్రామస్తులకు మరోచోట ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామని అధికారుల ద్వారా మభ్యపెడుతున్నారు. ఈ భూబాగోతం కథాకమామిషు ఏమిటంటే..
ఆసలు సంగతి ఇదీ..
మల్లవల్లి పారిశ్రామికవాడ భూసేకరణ సమయంలో జారీ చేసిన జీఓ–456 ప్రకారం.. మల్లవల్లి రీసర్వే నంబర్ 11లోని 1,460 ఎకరాల్లో 1,360 ఎకరాలను ఏపీఐఐసీ పారిశ్రామికవాడకు, మిగిలిన 100 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్లస్థలాలు, సామాజిక అవసరాల నిమిత్తం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో జగనన్న కాలనీ కింద కొంతమేర లేఅవుట్ వేసి స్థలాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లుచేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు రావడంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ప్లేటు ఫిరాయించారు. గ్రామానికి ఇస్తామన్న భూమి ఇది కాదు, అది మరోచోట ఉందంటూ కొత్త పాట పాడుతున్నారు. గ్రామానికి దూరంగా.. నిరుపయోగంగా.. లోయలు తలపించేలా ఉన్న భూమిని గ్రామస్తులకు అంటగట్టి మల్లవల్లిలో ఖరీదైన 100 ఎకరాల భూమి హస్తగతం చేసుకోవడానికి చకచకా పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు అభ్యంతరం చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం పోలీసు బలగాల సాయంతో భూనిర్వాసితులను గృహ నిర్బంధం చేసి రెవెన్యూ అధికారులు 1,360 ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
కారుచౌకగా కట్టబెట్టడానికి యత్నం..
నిజానికి.. మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ చుట్టుపక్కల ఎకరం విలువ రూ.కోటి పైమాటే. ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.89 లక్షలుగా ఉంది. మల్లవల్లి పారిశ్రామికవాడలో మరిన్ని పరిశ్రమలను ఆకర్షించే పేరుతో ఈ ధరను తగ్గిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడ ఎకరా రూ.18 లక్షలకే విక్రయించేందుకు త్వరలోనే జీఓ విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక అవసరాలకు కేటాయించిన 100 ఎకరాల భూమిని అస్మదీయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. అంటే.. రూ.100 కోట్లకు పైగా విలువచేసే భూమిని ఎకరం కేవలం రూ.18 లక్షలకే కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.
పెద్ద మొత్తంలోనే ముడుపులు..
టీడీపీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి డైరెక్షన్‌లోనే రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు సర్వే పనులు చేస్తున్నారు. గ్రామస్తులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపిస్తామని నమ్మించి, సామాజిక అవసరాలకు కేటాయించిన భూమిని ప్రభుత్వ పెద్దలకు అప్పగించి, ప్రసన్నం చేసుకోవడానికి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులూ తహతహలాడుతున్నారు. ఈ వ్యవహారంలో గ్రామస్తులను మభ్యపెట్టి, కారుచౌకగా పారిశ్రామికవాడలో భూమిని తిరిగి ఏపీఐఐసీకి అప్పగించి అక్కడ నుంచి సదరు ప్రజాప్రతినిధి దక్కించుకుని ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా డీల్ కుదిరింది. ఇందులో భాగంగా.. ఆ ప్రైవేట్ వ్యక్తులు సదరు ప్రజాప్రతినిధికి పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పేదల భూమి లాక్కోవడం తగదు
మల్లవల్లి పారిశ్రామికవాడ ఏర్పాటు తరుణంలోనే పేదల ఇళ్ల స్థలాలు, సామాజిక అవసరాల నిమిత్తం 100 ఎకరాల భూమి కేటాయించారు. గ్రామానికి ఆనుకుని ఉన్న ఆ భూమిలో ఇప్పటికే ఇళ్ల స్థలాల లే అవుట్ కూడా సిద్ధం చేశారు. దాదాపు రెండు వేల మంది నిరుపేదలకు ఇవ్వడానికి స్థలాలు సిద్ధం చేశారు. ఈ స్థలాన్ని వదులుకునేందుకు ఒప్పుకోం. గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ భూమిలోనే పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
– వేముల రంగారావు, మల్లవల్లి
నివాసయోగ్యంగా లేని భూమి ఇస్తామంటే ఎలా?
ఎన్నో ఏళ్లుగా గూడులేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ భూమి తీసుకుని మరెక్కడో నివాసయోగ్యంగా లేనిచోట ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎట్లా? కొండల్లో, గుట్టల్లో కనీసం నడకదారి కూడా లేని ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు ప్రత్యామ్నాయ భూమి అప్పగించడం కుదరదు. గతంలో కేటాయించిన భూమిని వదులుకోం.
– తోట సాంబశివరావు మల్లవల్లి
Comments
Please login to add a commentAdd a comment