ఆస్తిపై కన్నేసి.. కర్కశంగా దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విలువైన ఆస్తులు ఉన్న వారికి టీడీపీ నేతలు మనశ్శాంతిని దూరం చేస్తున్నారు. ముఖ్య కూడళ్లలో, వ్యాపార సముదాయాల్లో ఉన్న స్థిర ఆస్తిని బల వంతంగా రాయించుకునేందుకు ఎప్పుడు ఏ ముఠా వచ్చి పడుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. తాజాగా సూర్యారావుపేట దాసరి వారి వీధిలో ఓ భవన యజమానిపై టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో పచ్చ బ్యాచ్ చేసిన అమానుష దాడి ఆ ప్రాంత ప్రజలను భీతావహులను చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆస్తుల సెటిల్‌మెంట్‌లకు, బలవంతపు రిజిస్ట్రేషన్‌లకు ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
కన్నేసిన ఆస్తిని కారు చౌకగా కొట్టెయ్యాలని..
సూర్యారావుపేట దాసరివారి వీధిలో మానేపల్లి వెంకట లక్ష్మణరాజాకు ఓ భవనం ఉంది. ఆ భవనం పాతది కావడంతో ఆ కుటుంబం కొన్నేళ్ల పాటు వేరే ప్రాంతంలో నివాసం ఉండి, తిరిగి 2022లో భవనానికి మరమ్మతులు చేయించి అందులోనే నివసిస్తోంది. ఈ ఆస్తిపై అదే ప్రాంతానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు అసపు సుధాకర్, అసపు ఈశ్వర్ కన్నేశారు. రూ.కోట్ల విలువ చేసే ఆస్తిని రూ.లక్షలకు విక్రయించాలని గతంలోనే కోరారు. దీనికి లక్ష్మణరాజా అంగీకరించలేదు. దీంతో అప్పట్లోనే టీడీపీ నేతల అండతో అత డిని బెదిరించారు. అయినా లక్ష్మణరాజా అంగీకరించకపోవడంతో సమయం కోసం వేచి చూశారు. అధి కారం అండ దొరికిన వెంటనే అంగ బలాన్ని సమకూర్చుకుని ఈ ఏడాది సెప్టెంబర్‌లో లక్ష్మణరాజా ఇంటిపై బీరు సీసాలతో దాడికి దిగారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కొన్నాళ్లు పాటు ఆగినట్లే ఆగి డిసెంబర్‌లో మరో మారు దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ లక్ష్మణరాజా వారి దారిలోకి వెళ్లకపోవడంతో నేరుగా ముఖ్యనేతలే రంగంలోకి దిగారు. సూర్యారావుపేట, బీసెంట్‌రోడ్డు, ఏలూరు రోడ్డు వ్యాపార సముదాయాల్లో సెటిల్ మెంట్లనే జీవనోపాధిగా మార్చుకున్న ఆ ప్రాంత టీడీపీ నేత, సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో మరి కొంత మంది నేతలు బాధితుడిని బెదిరించారు. అయినా ఆస్తిని వదులుకునేందుకు లక్ష్మణరాజా ఒప్పుకోకపోవడంతో టీడీపీ నేతలు చివరి అస్త్రాన్ని ప్రయోగించారు.
విచక్షణారహితంగా దాడి
నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆ ప్రాంత ముఖ్య నేత అండతో ఈ నెల 18వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు లక్ష్మణరాజా ఇంటిపై పచ్చబ్యాచ్ విరుచుకుపడింది. వంద మంది ఒకే సారి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి లక్ష్మణరాజా, అతని కుటుంబ సభ్యులపై కర్రలు, ఇనుపరాడ్లు, బీరు సీసాలు, యాసిడ్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బీరు సీసాలతో మోదడంతో లక్ష్మణరాజా తలపై నాలుగు బలమైన గాయాలయ్యాయి. ఇనుపరాడ్లతో రెండు కాళ్ల చీలమండలాలను ఛిద్రం చేశారు. ఒంటిపై, చేతులపై, కాళ్లపై ఇలా ప్రతి చోటా గాయాలు చేసి చిత్రహింసలకు గురి చేశారు. అనంతరం ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా వంట సామాన్లు, దుస్తులు, ఫర్నిచర్ మొత్తానికి నిప్పు పెట్టి ఇంటిని కాల్చేశారు.
రౌడీ మూకలకు పోలీసుల అండ
2024 జూలై నెల వరకు సూర్యారావుపేట పోలీసుల నుంచి బాధితుడికి రక్షణ దొరికింది. ఆ తరువాత స్టేషన్‌లో జరిగిన అధికార మార్పిడి బాధితుడికి కష్టాలను తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 18వ తేదీ వరకు తన ఇంటిపై, తనపై ఆరు సార్లు దాడి చేశారని, దాడి జరిగిన ప్రతి సారి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు లక్ష్మణరాజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోగా తననే తిట్టేవారని, కొట్టేవారని, ఒక సారి తనపైనే ఎదురు కేసు నమోదు చేశారని వాపోతున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్టేషన్ అధికారి వెంటనే తన ఫోన్‌ను లాక్కుని తనను సెల్‌లో వేసేవాడని ఆరోపించారు. తనపై ఈ తరహా దాడి జరగడానికి సూర్యారావుపేట పోలీసులే ఒక కారణమని పేర్కొన్నారు. ఆదిలోనే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడ వరకు తెగబడే వారి కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విలువైన ఆస్తులపై టీడీపీ నేతల కన్ను రౌడీ, అల్లరి మూకలతో బెదిరించి యజమానులపై దాడికి పాల్పడుతున్న వైనం తాజాగా సూర్యారావుపేటలో భవన యజమాని లక్ష్మణరాజాపై దాడి
Comments
Please login to add a commentAdd a comment