సహకార సంఘాలతోనే రైతుల ప్రగతి
పర్లాకిమిడి: రైతుల ఆర్థిక, సామాజికాభివృద్ధికి సహకార సంఘాలు దోహదపడతాయని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్.ఫంక్షన్ హాలులో జరిగిన 72వ భారతీయ సహకార సంఘాల వారోత్సవాల్లో కలెక్టర్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ జితేంద్రనాథ్ పండా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, సబ్ కలెక్టర్ అనూప్ పండా, బరంపురం కోపరేటివ్ సొసైటీల అధికారి నృసింహా చరణ్ బెహరా, జిల్లా వ్యవసాయ అధికారి రాంప్రసాద్ పాత్రో, నాబార్డు ఏజీఎం ప్రతీక్ పండా తదితరులు హాజరయ్యారు. రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద పరపతి వాడే కంటే, ప్రభుత్వ సహకార పరపతి వద్ద స్వల్పకాలిక రుణాలు తీసుకుంటే మంచిదని కలెక్టర్ దాస్ ఉద్బోధించారు. అనంతరం జెడ్పీటీసీ ఎస్.బాలరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది రైతులు ఖరీఫ్ ధాన్యం మండీల వద్దే విక్రయాలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర తీసుకోవాలన్నారు. సహకార పరపతి సంఘాలు, రైతులకు అవినాభావ సంబంధం ఉందని బాలరాజు అన్నారు. స్వల్పకాలిక పరపతి సంఘాల రుణాలు తీసుకుని పంపుసెట్లు, బోరుబావులు తవ్వించుకుని రైతులు లాభదాయకమైన పంటలు పండించవచ్చని సబ్ కలెక్టర్ అనుప్ పండా అన్నారు. జిల్లాలో 87 సహకార పరపతి సంఘాలు ఉన్నాయని, వాటి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ ఏడాది ఖరీఫ్ పంట విక్రయం చేసుకోవచ్చని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఈ సందర్భంగా గత 35 ఏళ్లుగా బరంపురం కో ఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అర్బన్ బ్యాంకు డైరెక్టర్ అభిమన్యుపండా, బరంపురం కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్, ఆర్.యం.సి.యస్. డైరక్టరు కోడూరు కిరణ్ కుమార్, తంపరకవిటి సొసైటీ డైరెక్టర్ గేదెల శ్రీధరనాయుడుని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా భాజపా కృషక్ మోర్చా అధ్యక్షులు ప్రశాంత పాలో తదితరులు కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment