భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె పర్యటన ఖరారైంది. డిసెంబరు నెల 4న పూరీ బ్లూ ఫ్లాగ్ తీరంలో నేవీ దినం వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సొంత జిల్లా మయూర్‌భంజ్ సందర్శిస్తారు. వచ్చే నెల 3న స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. మర్నాడు పూరీ సాగర తీరంలో జరగనున్న నేవీ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాలుపంచుకుంటారు. అదే రోజు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం ఓయూఏటీ 40వ కాన్వొకేషను కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబరు నెల 5న కొత్త జుడిషియల్ కోర్టు సముదాయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. మర్నాడు కోల్‌కత్తా మీదుగా ఆమె సొంత జిల్లా మయూర్‌భంజ్ చేరుతారు. కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక హెలికాప్టరులో మయూర్‌భంజ్ రొంగొమటియా వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో దళిత గ్రామం ఉప్పొరొబెడా చేరుతారు. ఈ ప్రాంతంలో రాష్ట్రపతి విద్యాభ్యాసం పొందిన ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడి ఉపాధ్యాయులు, బాలలతో ప్రత్యక్షంగా సంభాషించి కాసేపు ముచ్చటగా కాలక్షేపం చేస్తారు. రాయరంగపూర్ తన సొంత ఇంటిలో ఆరోజు మద్యాహ్న భోజనం చేస్తారు. స్వగ్రామం ఆస్పత్రిలో అంబులెన్సు వాహన సేవల్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం రాయరంగపూర్ మహిళా కళాశాల సందర్శన పురస్కరించుకుని విద్యార్థినులతో సంభాషిస్తారు. అక్కడి పుణేశ్వర ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగియడంతో సొంత ఇంటికి చేరి రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానికులతో కలిసి మెలిసి కాసేపు గడిపి దండబోష్ ఎయిర్ స్ట్రిప్ నుంచి వాయు మార్గంలో బంగిరిపొషి చేరుతారు. ఆ ప్రాంతంలో 3 రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రపతి శంకు స్థాపన చేస్తారు. వీటిలో బాదం పహాడ్ – కెంజొహర్‌గొడొ, బంగిరపొషి – గోరుమొహిషాని మరియు బురామరా – చకులియా రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో దళిత పరిశోధన కేంద్రం నిర్మాణం, దండబోష్ ఎయిర్ స్ట్రిప్, సబ్ ఆస్పత్రి అభివృద్ధికి శంకు స్థాపన చేస్తారు. కార్యక్రమాలు ముగించుకుని కోల్‌కతా డిఫెన్సు ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment