ముగిసిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ అంబాగుత గోపబందు ప్రభుత్వ ఐటీఐ లో గత మూడు రోజులు జరిగిన జోనల్ స్థాయి క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాకాంత పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఫెస్ట్ ముగింపు ఉత్సవంలో ముఖ్యఅతిథిగా రావణగుడ ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. అంబోగుడలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. క్రీడా పోటీల్లో గెలుపోటములు సమానమన్నారు. ఓటమి చెందినవారు నిరుత్సాహానికి గురికాకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. గౌరవ అతిథులుగా కొరాపుట్ జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సుబేందు మిశ్ర హాజరయ్యారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని 14 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల నుంచి విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఉత్తమ క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరుగనున్న ఫెస్ట్ పోటీలకు పంపనున్నట్లు ప్రిన్సిపాల్ ఉమాకాంత పట్నాయక్ వెల్లడించారు. అంబాగుడ ఐటీఐ శిక్షకులు పరమానంద గౌడ, రాకేష్ మిశ్ర, సంతోష్ కుమార్ పాత్రో, హరప్రసాద్ మల్లిక్, చంద్రానంద బెహర, శరత్ గంతాయిత్, సతీష్ కుమార్, అర్జున మండల్, సునీల్ కుమార్, రెజమా బీబి, రూపేష్ మహంతి క్రీడా పోటీలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment