రాబుగుడలో ఏనుగుల బీభత్సం
● ధాన్యం బస్తాలు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీలోని రాబుగుడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం రెండు ఏనుగులు గ్రామంలోకి చొరబడి ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన మమిత బొరిషక, గోవింద బొర్షిక, సంతోష్ బొరిషకలకు చెందిన సుమారు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ఏనుగులు చెల్లాచెదురు చేశాయి. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా పండించిన ధాన్యం తడిసిపోవడంతో వాటిని ఎండపెట్టిన అనంతరం బస్తాల్లో వేసి ఒక గుడిసెలో పెట్టారు. శనివారం సాయంత్రం రెండు ఏనుగులు చొరబడి గుడిసెను విరగ్గొట్టడంతొ పాటు అందులో భద్రపరిచిన ధాన్యం బస్తాలను చెల్లాచెదురు చేశాయి. కొన్ని బస్తాల్లోని ధాన్యాన్ని తినేశాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం ఏనుగుల పాలవ్వడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment