రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
రాయగడ: ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం, పత్తి రైతులు నష్టాల బారిన పడ్డారని, చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయని పంట నష్టాలను అంచనా వేసి ప్రతి బాధిత రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా కిషాన్ మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు తిరుపతి గొమాంగొ నేతృత్వంలో జిల్లాలోని గుణుపూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అనంతరం ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్‌ఇండియా కిషాన్ మోర్చా నాయకుడు గొమాంగొ మాట్లాడుతూ ఆకాల వర్షాల కారణంగా రైతులు ఎనలేని నష్టాలను చవి చూశారని అన్నారు. అందువల్ల ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండీల్లో తగిన ధర ఇవ్వాలన్నారు. ధాన్యం, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆందోళనలో భగసొల పంచాయతీ సర్పంచ్ మదన్ సబర్, బృందావన్ బిడిక, రమేష్ బిడిక, కేశవ్ సబర్, మోజేష్ సబర్, కరుణాకర్ లిమ్మ, తవుడు సబర్, రాజేంద్ర మాఝి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment