మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు
పర్లాకిమిడి: పట్టణంలో సంచలనం సృష్టించిన కృష్ణచంద్ర పండా మర్డర్ కేసును ఆదర్శ పోలీసుస్టేషన్ అధికారులు ఛేదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా కంకిపాడులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 25వ తేదీన స్థానిక కొత్త కాపువీధికి చెందిన కృష్ణచంద్ర పండా మృతదేహం ఆంధ్రా– ఒడిశా సరిహద్దు సీతాసాగరంలో ఒక గోనె సంచెలో దొరికిన విషయం తెలిసిందే. దీనిపై మృతుడి కుమారుడు సంతోష్ పండా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదర్శపోలీసు స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. జంగం వీధిలో రాజ్యలక్ష్మి క్లినిక్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్న మరియాల దుర్యోధన, సహచరులు కలిసి కృష్ణచంద్ర పండాను కొట్టిచంపి ఒక గోనె సంచెలో పెట్టి ఆటోలో తీసుకొచ్చి సీతాసాగరంలో పారవేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేసి చివరకు ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా కంకిపాడు చేపల మార్కెట్‌లో నిందితులు నలుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో మరియాల దుర్యోధన్, అరుణ్ లిమ్మా, తారాసాయి మహేష్, మరియాల మల్లి ఉన్నారు. వీరందరూ పర్లాకిమిడి జగ్గిలి వీధికి చెందినవారు.
అసభ్యంగా ప్రవర్తించడంతో...
మృతుడు కృష్ణచంద్ర పండా, మల్లికి ఇదివరకే పరిచయం ఉంది. ఇటీవలే మరియాల దుర్యోధనతో ఆమెకు వివాహం జరిగింది. అయితే డిసెంబర్ 25న జంగంవీధి రాజ్యలక్ష్మి క్లినిక్‌లో నివాసం ఉంటున్న మరియాల మళ్లి వద్దకు కృష్ణచంద్ర పండా వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఆమె భర్త లేకపోవడంతో మల్లితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఆమె భర్త మరియాల దుర్యోధన వచ్చి విషయం తెలుసుకొని కృష్ణచంద్ర పండాను కొట్టాడు. దీంతో స్పృహా కోల్పోయిన పండా మృతి చెందాడు, అనంతరం పండా మృతదేహాన్ని గోనె సంచెలో కట్టి ఆ రాత్రికే కాంప్లెక్స్ నుంచి తన బంధువుల సాయంతో తరలించాలని పథకం వేశాడు. అనుకున్నట్టుగానే ఒక ఆటోలో సీతా సాగరంకు తరలించి శవాన్ని హత్య జరిగిన రాత్రి విసిరివేశాడు. తదనంతరం పోలీసుల దర్యాప్తులో జంగంవీధి సీసీ టీవీల సాయంతో నిందితులు పట్టుబడ్డారు. కేసులో ఇంకా ఎవరెవరు నిందితులు ఉన్నా పట్టుకుని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా పేర్కొన్నారు. సమావేశంలో ఆదర్శ పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత్ భూపతి తదితరులు పాల్గొన్నారు.
నలుగురు నిందితులు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment