దళితుల ఇళ్లు కూల్చివేత దారుణం
క్రోసూరు:ిపడుగురాళ్లలో దళితుల ఇళ్లను కూల్చిన మద్దాల సుబ్బయ్యపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ బుధవారం డిమాండ్ చేసింది. క్రోసూరులో కమిటీ సభ్యులు గార్లపాటి దాసు, బంకా శ్రీనివాసరావు, పట్టెపు మరియదాసు విలేకరులతో మాట్లాడారు. 1996లో ప్రభుత్వం కొమ్ము కోటిరత్నానికి 14.5 సెంట్ల స్థలాన్ని ఇచ్చింది. దాన్ని గతంలో చల్లా సీతారామిరెడ్డి కబ్జా చేసేందకు యత్నించగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా కోటిరత్నం కుమారుడు ఆనందరావు తన తల్లి పేర డిక్రీ తెచ్చుకున్నారు. ఉత్తర్వుల కాపీని అప్పటి ఆర్డీవోకు, తహశీల్దార్‌కు అందించారు. ఆ స్థలంలో ఆనందరావు సహా ఏడు కుటుంబాలు సిమెంట్ బ్రిక్స్ తయారీతో పాటు హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి మద్దాల సుబ్బయ్య అనే వ్యక్తి 40 మంది మనుషులతో వచ్చి దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. ఇళ్లను పడేసి, ఆర్థికంగా రూ.50 లక్షల ఆస్తి నష్టపరిచాడని కమిటీ సభ్యులు తెలిపారు. సుబ్బయ్యపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గృహాలు మంజూరు చేసి, నిందితుడితో బాధితులకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment