17న కౌన్సిల్ సమావేశం నిర్వహించండి
గుంటూరు కమిషనర్‌కు మేయర్ మనోహర్‌నాయుడు లేఖ
నెహ్రూ నగర్(గుంటూరు ఈస్ట్): నగర సమగ్రాభివృద్ధి దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈనెల 17న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు నగర కమిషనర్ పులి శ్రీనివాసులకు బుధవారం లేఖ రాశారు. ఈనెల 4న జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలో కమిషనర్ వ్యవహరించిన తీరును లేఖలో మేయర్ తప్పుబట్టారు. ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు బాధాకరమని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తగవని హితవుపలికారు. ఐఏఎస్‌ల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలని, ఇప్పటికై నా నియంతృత్వ పోకడలు వీడి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు, 46వ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని, మేయరైన తనకు కనీస సమాచారం లేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న మేయర్‌ను అవమానించడం పరోక్షంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మనోహర్ ఘాటుగా స్పందించారు. నగరపాలకసంస్థ అభివృద్ధి దృష్ట్యా సంయమనం పాటిస్తున్నామని ఇప్పటికై నా మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955లోని సెక్షన్ 88సీ , పేజీ నంబర్ 135 ప్రకారం ఈనెల 17న కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
మహంకాళి దేవస్థానానికి రూ.లక్ష విరాళం
తాడేపల్లిరూరల్: కంఠంరాజు కొండూరు గ్రామంలోని మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి దాత మంగళవారం 1,00,116 అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి గుంటూరు వాస్తవ్యులు మునగాల సత్యనారాయణ రెడ్డి, బంగారం దంపతులు ఈ విరాళాన్ని అందజేశారని వివరించారు. అనంతరం సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని వివరించారు.
అడుసుమల్లికి తెలుగు కీర్తి జాతీయ పురస్కారం
బాపట్ల: బాపట్లకు చెందిన అడుసుమల్లి మల్లికార్జునకు తెలుగు కీర్తి జాతీయ పురస్కారం దక్కింది. ట్రాన్స్‌కో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన అడుసుమల్లి రచయితగా, సాహితీవేత్తగా పలు రచనలు చేశారు. ప్రస్తుతం విశ్రాంత జీవితంతోనూ రచనలుచేస్తున్నారు. ఆయన సాహిత్య సేవను గుర్తించిన శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితర సంస్థలు సంయుక్తంగా తెలుగుకీర్తి అవార్డును ప్రకటించాయి. ఈనెల 21న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అడుసుమల్లి ఈ పురస్కారన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా పుర ప్రముఖులు, సాహితీ మిత్రులు సాయిబాబు, లైబ్రరియన్ శివాజీ గణేషన్, ఏపీ ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ ఆలపర్తి నారాయణస్వామి తదితరులు అడుసుమల్లికి అభినందనలు తెలిపారు.
కవి జయరాజు రచనలు అభినందనీయం
పొన్నూరు: అంబేడ్కరిజాన్ని మార్క్సిజాన్ని సమన్వయించి పాటలు రాసి, పాడుతూ సమాజాన్ని ఉత్తేజపరుస్తున్న తెలంగాణ కవి జయరాజు అభినందనీయులని ప్రముఖ కవి డాక్టర్ కత్తి పద్మారావు కొనియాడారు. మంగళవారం పట్టణంలోని లుంబినీవనంలో కత్తి పద్మారావును జయరాజు తన సతీమణి మంగతాయారు, కుమారుడు రమణతోపాటు కలిశారు. ఈ సందర్భంగా జయరాజు రచించిన పుస్తకాలను పద్మారావుకు అందించి పాటలు ఆలపించారు. పద్మారావు తాను రచించిన భారతదేశ చరిత్ర పుస్తకాన్ని జయరాజుకు అందించారు. అనంతరం జయరాజు కుటుంబ సభ్యులను పద్మారావు సన్మానించారు. కార్యక్రమంలో కత్తి స్వర్ణ కుమారి, దాసరి శ్యామల, రాణి, కత్తి లోకాయత్, హేమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment