బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రెండు సంస్థలకు పనులు పంచి పెట్టి డబ్బులు దండుకునేందుకు కుట్ర.. పొంగులేటి కంపెనీకి మూసీ ప్రాజెక్టు పనులు
సుంకిశాల ఘటనపై నివేదికను సీఎం తారుమారు చేసే చాన్స్
సాక్షి, హైదరాబాద్: ‘బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా కంపెనీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు రూ.4,350 కోట్ల కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు కట్టబెడుతున్నారు. అనుభవం కలిగిన కంపెనీలను టెక్నికల్ బిడ్‌లో అనర్హులుగా ప్రకటించి రెండు సంస్థలకు కేక్ ముక్క ల్లా పనులు పంచి పెట్టి డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నారు. రూ.4,350 కోట్లలో సీఎం వాటా, ఢిల్లీ వాటా ఎంతో చెప్పాలి..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మె ల్యే వివేకానంద్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో అరాచక కంపెనీ, ఆంధ్రా కంపెనీ అన్నారుగా..
‘రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అని పేర్కొన్న మేఘా సంస్థకే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రూ.వేల కోట్ల విలువ చేసే పనులు అప్పగిస్తున్నారు. గతంలో ‘అరాచక కంపెనీ’, ‘ఆంధ్రా కంపెనీ’, ‘పొలిటికల్ మాఫియా’అని సదరు కాంట్రాక్టు సంస్థపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తెచ్చేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ సదరు సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం మూలంగా కూలిపోయినా బ్లాక్ లిస్టులో పెట్టకపోవడానికి కారణమేంటో చెప్పాలి. కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్టును రేవంత్‌రెడ్డి తారుమారు చేసే అవకాశం ఉంది. ఆ నివేదికను వెంటనే బయట పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గోదావరి జలాల పేరిట రూ.5,500 కోట్ల కుంభకోణం
‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’నిబంధన పక్కన పెట్టి మంత్రివర్గ సభ్యుడైన పొంగులేటికి సంబంధించిన కంపెనీకి మూసీ ప్రాజెక్టు పనులు ఇస్తున్నారు. రేవంత్‌కు సహాయ మంత్రిలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ కూడా దీనిపై మాట్లాడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్న మోదీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించేందుకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,100 కోట్లతో ప్రతిపాదించిన పనులు రద్దు చేశారు. ఇప్పుడు అంచనాలు రూ.5,500 కోట్లకు పెంచి మరో భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ఈ ప్రాజెక్టును కూడా ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’కి ఇచ్చేందుకే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం చెప్పిన చోట అధికారులు సంతకాలు పెడితే ఉద్యోగాలు ఊడటం ఖాయం..’అని మాజీమంత్రి హెచ్చరించారు.
పొంగులేటీ..నువ్వు జైలుకు పోకుండా చూసుకో
‘అరెస్టులు అంటూ అందరి జాతకాలు చెప్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలి. పొంగులేటి నివాసంలో జరిగిన ఈడీ దాడులపై ఇప్పటివరకు బీజేపీ స్పందించలేదు. ఐటీసీ కోహెనూర్ హోటల్లో అదానీ కాళ్లు పట్టుకుని, కడుపులో తలపెట్టి తనను కాపాడాలని పొంగులేటి కోరాడు. రేవంత్ నివాసంలో గౌతమ్ అదానీ కొడుకు కరణ్ అదానీతో నాలుగు గంటల సుదీర్ఘ భేటీ జరిగింది. ఈడీ దాడిలో ఏం జరిగిందో పొంగులేటి చెప్పాలి.
అరెస్టుల గురించి చెప్పడానికి పొంగులేటి ఎవరు? వీళ్లు నడిపేది సర్కారా లేక సర్కస్సా?. గొట్టంగాళ్లకు భయపడేది లేదు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటులో కాంగ్రెస్ హస్తం ఉంది. మరమ్మతు చేయకపోవడం వెనుక ఏదో మతలబు ఉంది. కేసీఆర్‌ను బదనాం చేసేందుకు ఈ అరాచక శక్తులు ఎంతకైనా తెగిస్తాయి. కుంభకోణాలను బయట పెడుతున్నందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు. అయినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment