ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Speech At Praja Vijayotsavalu | Sakshi
Sakshi News home page

ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: సీఎం రేవంత్‌

Published Thu, Dec 5 2024 4:55 PM | Last Updated on Thu, Dec 5 2024 6:04 PM

CM Revanth Reddy Speech At Praja Vijayotsavalu

సాక్షి,హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 

ఏడాది పాలనపై కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 55వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు. 

..‘తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలనే సంకల్పంతో ఆరుగ్యారెంటీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్‌ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ ఉద్యోగులు ఆరుగ్యారెంటీల నుంచి ప్రయాణికుల్లో అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలకు బ్రాండ్‌ అంబాసీడర్లుగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయబట్టే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

..అలాంటి బ్రాండ్‌ అంబాసీడర్లయిన ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో నష్టాల్లో ఉన్న సంస్థను కాంగ్రెస్‌ మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో గతేడాది నవంబర్‌ నెల నుంచి ఈ ఏడాది నవంబర్‌ నెల వరకు సుమారు 113కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

..ఆర్టీసీ అభివృద్ది దిశగా నడిపిస్తున్నాం. రూ.4వేల కోట్లను ఆర్టీసీకి బదిలీ చేశాం. కేసీఆర్‌ పాలన లో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ఇప్పుడు అదే ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్బంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశాం. ఇది ఆర్టీసీని పునరుజ్జీవింప చేసింది.

..ఇది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగును నింపే కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర

కానీ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారు.

పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోంది. రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేశాం.

వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు.. అందుకే రైతులు సన్నాలు పండించండి. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తాం. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తాం. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దాం.

నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా. ఏ లక్ష్యం కోసం అమరుల ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. ఇందులో ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.

నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత మీపై ఉంది..ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉంది.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది.రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్  నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతాం.హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించండి..

నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉంది.మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తాం.అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతాం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement