చంద్రబాబుపై సజ్జల ధ్వజం
తలాతోక లేని ఐఎంజీ భారత్‌కు హైదరాబాద్‌లో 850 ఎకరాలా?
21 ఏళ్ల క్రితమే రూ.లక్ష కోట్ల దోపిడీకి బాబు స్కెచ్
వైఎస్సార్ ఔదార్యం చూపకుంటే నాడే జైలు పాలు
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో బాబు దోపిడీ రుజువైంది
అమరావతిలోనూ అదే తరహా దోపిడీకి పథకం
అప్పట్లో ప్రభుత్వ భూములు.. తర్వాత రైతుల భూములు స్వాహా
స్టార్టప్ ఏరియా పేరుతో ప్రైవేట్ సంస్థకు 1,700 ఎకరాలు పందేరం
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఇక్కడా రూ.లక్ష కోట్లు కాజేసే ఎత్తుగడ
ఇదే రీతిలో స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అత్యంత శాస్త్రీయంగా దోపిడీ చేయగలిగిన అంతర్జాతీయ గజదొంగ అన్నది మరోసారి నిరూపితమైందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఐఎంజీ భారత్ భూ కుంభకోణంపై తెలంగాణ హైకోర్టు గురువారం జారీ చేసిన ఆదేశాలే అందుకు నిదర్శనమన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం తలా తోక లేని ఐఎంజీ భారత్ కంపెనీకి నాలుగు రోజుల్లోనే 850 ఎకరాలు కట్టబెట్టి రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన ఘనాపాటి చంద్రబాబు అని పేర్కొన్నారు. విభజన తర్వాత అదే తరహాలో అమరావతి స్టార్టప్ ఏరియా కుంభకోణానికి తెరతీసి రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని గుర్తు చేశారు.
ఐఎంజీ భారత్ కుంభకోణంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టడానికి సెŠక్‌చ్ వేస్తే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రైతుల భూములను కాజేసేందుకు పథకం వేశారన్నారు. స్కిల్ స్కామ్‌లో రూ.371 కోట్లు అడ్డంగా దోచేశారన్నారు. మరోసారి దోచుకునేందుకే అధికారం కోసం అర్రులు చాస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంటర్నేషనల్ స్కామ్‌స్టర్..
♦ ఐఎంజీ స్పోర్ట్స్ అనే అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేకుండా ఐఎంజీ భారత్ అనే బోగస్ సంస్థను 2003 ఆగస్టు 5న ఏర్పాటు చేశారు. క్రీడల అభివృద్ధికి ఆ సంస్థ చేసిన ప్రతిపాదనపై ఎలాంటి విచారణ చేయకుండానే 2003 ఆగస్టు 6న ఆగమేఘాలపై ఆమోదించారు. ఆగస్టు 9న ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కోరుకున్న స్టేడియంలను ఆ సంస్థకు అప్పగించాలని, స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం, స్టేడియాల నిర్వహణకు ఏడాదికి రూ.2.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ప్రభుత్వం భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. మూడేళ్లపాటు విద్యుత్, నీరు, సీవేజ్, డ్రైనేజ్ బిల్లులను వంద శాతం తిరిగి చెల్లిస్తామని, ఆ తర్వాత తగ్గిస్తామని ఒప్పందం చేసుకున్నారు.
♦2003 నవంబర్ 14న చంద్రబాబు ప్రభుత్వం రద్దయింది. ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగింది. ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలో గచ్చిబౌలి వద్ద 400 ఎకరాలను ఎకరం రూ.50 వేల చొప్పున కౌరు చౌకగా ఐఎంజీ భారత్‌కు కట్టబెడుతూ సేల్ డీడ్ చేశారు. ఈ భూమికి అప్పట్లోనే మార్కెట్ విలువ ఎకరా రూ.2.50 కోట్లపైగానే ఉంది. అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణానికి ఈ భూమికి సమీపంలోనే అంకురార్పణ జరిగింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వస్తుందని తెలిసిన చంద్రబాబు దానికి పక్కనే మామిడిపల్లి వద్ద మరో 400 ఎకరాలను ఐఎంజీ భారత్‌కు కట్టబెట్టారు. జూబ్లీహిల్స్‌లో ఐఎంజీ భారత్ కార్యాలయం ఏర్పాటుకు 5 వేల చదరపు గజాల భూమిని కేటాయించారు.
♦ 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకపోయి ఉంటే చంద్రబాబు ఐఎంజీ భారత్‌తో కలిసి ఆ భూములను కాజేసేవారు. ఇప్పుడు ఆ భూముల విలువ రూ.లక్ష కోట్లు ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఆ కుంభకోణంపై విచారణ జరిపి భూముల కేటాయింపును రద్దు చేశారు. వైఎస్సార్ ఔదార్యం చూపకపోయి ఉంటే ఈ కుంభకోణంలో చంద్రబాబు అప్పుడే జైలుకు వెళ్లేవారు.
♦ఈ కుంభకోణంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తలా తోకా లేని సంస్థకు 4 రోజుల్లోనే 850 ఎకరాల భూమిని కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకు తాము ఆదేశించాలా? లేక మీరే కోరతారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రైతుల భూములతో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్
♦ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధాని భూసమీకరణ పేరుతో 33 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కుని అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస స్థలాలు ఇస్తానంటూ నమ్మబలికారు.
♦ రైతుల నుంచి లాక్కున్న 33 వేల ఎకరాల్లో 1,700 ఎకరాలను రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అంటూ సింగపూర్ ప్రభుత్వం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఆ ప్రాజెక్టులో గత ప్రభుత్వం పెట్టుబడి పెట్టడంతోపాటు రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని ఒప్పందంలో పేర్కొంది. స్టార్టప్ ఏరియా చుట్టూ సచివాలయం, అసెంబ్లీ, సీఎం కార్యాలయం, రాజ్‌భవన్ ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ప్లాట్లకు డిమాండ్ సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రూ.లక్ష కోట్లు దోపిడీకి స్కెచ్ వేశారు. ఆ ప్రాంతంలోనే నాటి మంత్రి నారాయణ, చంద్రబాబు బినామీలు భూములు కొన్నారు. రైతులకు అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస స్థలాలు ఇవ్వడంపై దృష్టి పెట్టకుండా వారి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు.
♦ సీమన్స్‌తో సంబంధం లేని బోగస్ సంస్థతో స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ద్వారా షెల్ కంపెనీలతో రూ.371 కోట్లను చంద్రబాబు కాజేశారు. ఈ కుంభకోణంలో ఆధారాలతో చంద్రబాబు పట్టుబడటంతో సీఐడీ ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఆ అక్రమాలకు ఆధారాలు లభ్యమవడంతో కోర్టు ఆయన్ను జైలుకు పంపింది. ఫైబర్ నెట్ స్కామ్ కూడా ఇలాంటిదే.
♦కరుడు గట్టిన గజదొంగలకు దొంగతనం చేయడంలో ప్రత్యేక శైలి ఉంటుంది. దాని ఆధారంగానే నిందితులను పోలీసులు పక్కాగా గుర్తిస్తారు. చంద్రబాబు కూడా అంతే. తలా తోకా లేని సంస్థలను తెరపైకి తెచ్చి ఐఎంజీ భారత్, అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు.
దింపుడు కళ్లం ఆశతో
అధికారంపై దింపుడు కళ్లం ఆశతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ను చేతిలో పెట్టుకుని షర్మిలమ్మకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించారు. అయినా సరే తాను అధికారంలోకి రాలేననే భయంతో బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో ఆ పార్టీ పెద్దల కాళ్లావేళ్లాపడుతున్నారు. ఇది చంద్రబాబు బలహీనతను, ప్రజల్లో సీఎం జగన్‌కు ఉన్న బలాన్ని చాటిచెబుతోంది. చంద్రబాబు ఎన్ని జెండాలతో జత కట్టినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం తథ్యం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment