కూటమి చిచ్చు..
ఎస్సీ ఉప కులాల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చురేపుతోంది. కులగణన పేరుతో చేపట్టిన కార్యక్రమం అంతా తప్పుల తడకగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అందకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే ఈ ప్రక్రియ జరుగుతోందని కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పారదర్శకత లోపించిందని, నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఉపకులాల మధ్య
ఎస్సీ జాబితాను ప్రచురించాలి
బేస్తవారిపేట: ఎస్సీ కులగణన విషయంలో అధికారులు నిబంధనలు పాటించడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పానుగంటి షాలేంరాజ్, జిల్లా కార్యదర్శి నేదరమల్లి జయరాజ్ అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ ఏవీ రంగనాయకులుకు వినతిపత్రం అందజేశారు. సచివాలయాల్లో ఎస్సీ జాబితాను ప్రచురించలేదన్నారు. కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని తెలిపారు. జాబితాను పరిశీలించి సరిచేయాలని, అవసరమైతే మరోసారి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్వేను నిస్పక్షపాతంగా చేయించి మాల, మాదిగల జనాభా ఎంత ఉందనే లెక్కలు పక్కాగా తేల్చడంతోనే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ మండల కన్వీనర్ కువ్వారపు రాజు, ఎంపీటీసీ సభ్యుడు కుంపటి సురేష్, నాయకులు మట్టేమల్ల ప్రవీణ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు.
ఒంగోలు అర్బన్:
కులగణనతో ఎస్సీ ఉప కులాల మధ్య కూటమి ప్రభుత్వం చిచ్చు రేపేందుకు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. స్పష్టమైన విధానం లేకుండా కులగణనపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. జాబితాలో తప్పులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలో పారదర్శకత లోపించడం వంటి వాటితో గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన ఎస్సీ కులగణనకు సంబంధించి జిల్లాలో తప్పులతడకగా ఉందంటూ అటు ఎస్సీ ప్రజలు, కుల సంఘాల నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కులగణనకు సంబంధించిన జాబితాలను సచివాలయాల్లో ఉంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ప్రకటించారు. అయితే ఈ అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి ఏ పల్లెల్లోనూ దండోరాలు వేయించడంకానీ ప్రచారం చేయడం కానీ చేయలేదు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతరాలు స్వీకరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు అడుగడుగునా సాంకేతిక లోపంతో ఈ ప్రక్రియ జాప్యం అవుతోంది. వీటన్నింటినీ అభ్యంతరాల స్వీకరణకు మరో పది రోజుల గడువు పెంచాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అంతా తప్పుల తడక..
జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించిన ఎస్సీ కులగణన జాబితా తప్పుల తడకగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబంలో సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో మతంతో జాబితా చేయడం గమనార్హం. భార్య, భర్త, తండ్రి, కూతురు, కుమారుడు ఉంటే వారికి వేరు వేరు కులాలుగా పరిగణించడం వంటి పొరపాట్లతో జాబితా రూపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి క్రిస్టియన్ మాదిగ అని నమోదు చేయడం వంటి ఇతర కారణాలతో జిల్లాలో సుమారు 10 వేల మందికి పైగా మాదిగలు నష్టపోతారని, ప్రభుత్వ పథకాలకు దూరం అవుతారని కుల సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలు ఉండగా కులగణనలో మాత్రం వేలాది తప్పులతో ఒక కులాన్ని తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని కుల సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఆంధ్ర, హిందూ మాదిగ అని కాకుండా క్రిస్టియన్ మాదిగ అని కులగణనలో చూపి మాదిగల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందనే విమర్శలు లేకపోలేదు. దీనిపై మాదిగలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కులగణనలో తప్పుల వల్ల ఎస్సీల్లోని మాల, మాదిగలకు, బీసీలకు మధ్యలో చిచ్చు రాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ నిర్దేశించిన గడువులో పూర్తి చేసేందుకు సచివాలయాల్లో సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలు వేధిస్తున్నాయి. అంతేకాకుండా అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి సవరణపై వీఆర్‌ఓ, ఆర్‌ఐకు పంపి ఆ తర్వాత తహశీల్దార్లకు పంపాలి. అయితే గ్రామ స్థాయి సిబ్బందికి దీనిపై పూర్తి అవగాహన, స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సచివాలయాల్లో జాబితాలపై సమాచారం ఏదీ..
వర్గీకరణలో భాగంగా ఎస్సీల జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించి వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంది. ఎస్సీ కులాల జాబితాపై డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. జాబితా చూసిన వారెవరైనా అభ్యంతరాలు ఇస్తే వీటిని సవరణ కోసం వీఆర్‌వో, ఆర్‌ఐ పరిశీలించి తహసీల్దార్ కు పంపాలి. కానీ ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలపై నేటికీ గ్రామస్థాయి సచివాలయ సిబ్బందికి స్పష్టత లేదు. సమస్యలు చెప్పుకునేందుకు వీఆర్వోను అడిగితే పంచాయతీ కార్యదర్శిని అడగమని, పంచాయతీ కార్యదర్శిని అడిగితే వీఆర్వోను అడగాలని చెప్తున్నారు తప్పితే ఎవరు ఏ పనిచేయాలో మాకే స్పష్టత లేకుండా ప్రజలకు ఏమి చెప్తామని సచివాలయ సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారే గానీ ఎస్సీ జనాభాకు సంబంధించి కులం, మతం వంటి సవరణలపై మాకు ఎలాంటి సమాచారం లేదని చెబుతుండడం గమనార్హం. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఎస్సీ జాబితాలో చాలా వరకు పేర్లు, కులం తప్పుగా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చాలాపేర్లు ఎస్సీ క్రిస్టియన్‌గా నమోదయ్యాయి. ఎవరికై నా ఎస్సీ ఫలాలు అందాలంటే ఎస్సీ క్రిష్టియన్ అని కాకుండా ఎస్సీ హిందూగా ఉంటేనే రిజర్వేషన్, వర్గీకరణ ఫలాలు అందేది. ఇలా తప్పులు జరిగితే ఎస్సీ ఫలాలు అందకుండా పోతాయని ఎస్సీలు ఆందోళన చెందుతున్నారు. మరో పది రోజుల గడువు పెంచి పారదర్శకంగా ఎస్సీ కులగణన చేపట్టాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్సీ కులగణన అంతా గందరగోళం తప్పుల తడకగా జాబితా ఎటువంటి ప్రచారం లేకుండా అభ్యంతరాల స్వీకరణపై కుల సంఘాల కన్నెర్ర ఒకే కుటుంబంలో సభ్యులకు వేర్వేరు కులాలు, మతాలుగా కులగణనలో లెక్కించిన అధికారులు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు నేటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు మరో పది రోజులు పెంచాలని డిమాండ్
మాదిగలకు అన్యాయం జరిగితే సహించం
ఎస్సీ కులగణనలో మాదిగలకు అన్యాయం జరిగితే సహించం. కులగణనలో లోపాలు, ప్రక్రియలోని తప్పులపై కలెక్టర్ స్పందించాలి. కులగణన పారదర్శకంగా లేకపోవడం వల్ల జిల్లాలో 10 వేలకు పైగా మాదిగలు నష్టపోయే అవకాశం ఉంది. సరైన అవగాహనతో కులగణన ప్రక్రియ, అభ్యంతరాల స్వీకరణ చేసి తప్పులను సరిచేయాలి. హడావుడిగా కాకుండా మరో పది రోజులు గడువు ఇచ్చి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి. మాదిగలకు అన్యాయం జరిగితే ఆందోళన చేపడతాం. మాదిగలను క్రిస్టియన్ మాదిగ అని కాకుండా హిందూ మాదిగగా నమోదు చేయాలి.
– కొమ్ము సుజన్, మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షుడు
కుల గణన తప్పుల తడకగా ఉంది
ఒంగోలు వన్‌టౌన్: కులగణన తప్పుల తడకగా ఉందని, తప్పులను సరిదిద్దుకునేందుకు జనవరి 30వ తేదీ వరకు గడువు పొడిగించాలని జైభీం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో పాటిస్తున్న విధానాలకు నిరసనగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. కార్యక్రమంలో దాసరి సుందరరావు, లింగంగుంట్ల రామలింగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment