హత్యకేసులో ముద్దాయికి
ఒంగోలు: హత్యకేసులో ముద్దాయికి యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలు 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కొత్తపట్నం మండలం కె.పల్లెపాలేనికి చెందిన అయిలా కోటిలింగం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పిచ్చయ్యను ఈతముక్కల బస్టాండ్ నుంచి ఆటోలో తనతోపాటు తీసుకెళ్లాడు. ఈతముక్కల పొలాల్లోని పేరంటాళ్ల కుంట వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి అదే సీసాతో పిచ్చయ్య తలపై కొట్టి గాయపరిచాడు. పిచ్చయ్య మొలతాడును తొలగించి దాని సాయంతో పిచ్చయ్య గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం అతని శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని వాటిని ఒంగోలులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక వైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో నిందితుడు కోటిలింగం వీఆర్‌వో ఎదుట హాజరై నేరం ఒప్పుకోవడంతో అప్పటి కొత్తపట్నం ఎస్సై ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేశారు. అప్పటి టూటౌన్ ఎస్సై రాఘవరావు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ముద్దాయిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ముద్దాయికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.6 వేలు జరిమానా విధిస్తూ 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతికుమారి వాదించగా, సాక్షులను కోర్టులో హాజరుపరిచి నిందితునికి సకాలంలో శిక్షపడేలా చేసిన కొత్తపట్నం సీఐ మేడా శ్రీనివాసరావు, ఎస్సై వేముల సుధాకర్, కోర్టు కానిస్టేబుళ్లు జి.అంకిరెడ్డి, వి.ప్రసాద్‌లను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment