ఎప్పుడూ షూ కూడా వేసుకోలేదు: ‘ఎంఐ’ పవర్‌ హిట్టర్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: ఎప్పుడూ షూ కూడా వేసుకోలేదు.. పవర్‌ హిట్టర్‌గా మారడం వెనుక!

Published Fri, Mar 22 2024 1:22 PM

Never Went School With Shoes: Romario Shepherd On Background Power Hitting - Sakshi

‘‘నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అందుకే ఎంత వీలైతే అంత నిరాడంబరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇక్కడిదాకా చేరుకునే క్రమంలో నా ప్రయాణం ఎంత కష్టతరంగా సాగిందో నాకు తెలుసు.

కాళ్లకు బూట్లు లేకుండానే స్కూలుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. నేనే కాదు.. బరాకరాలో 99 శాతం పిల్లలు ఎప్పుడూ నాలాగే కనీసం చెప్పుల్లేకుండా వెళ్లాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే.. బరాకరాలో ప్రయాణం మొత్తం నదుల మీదే సాగుతుంది.

అక్కడ కాంక్రీట్‌ రోడ్డులు ఉండవు. మొత్తం అంతా బురదమయమే. అంతా సవ్యంగా ఉన్న రోజు కుదిరితే పడవలో ప్రయాణం చేసేవాళ్లం’’ అంటూ వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ బాల్యంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు.

పవర్‌ హిట్టింగ్‌ ఎలా సాధ్యం?
పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కఠినంగా శ్రమించడమేనని పేర్కొన్నాడు. అదే విధంగా పవర్‌ హిట్టర్‌గా పేరొందడం గురించి మాట్లాడుతూ.. ‘‘మంచి బ్యాట్‌ ఉండి.. మనం బలంగా ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టవచ్చు(నవ్వుతూ).  

కొన్నిసార్లు అది సాధ్యపడకపోవచ్చు. సరైన సమయంలో సరైన బంతిని బాదితేనే దానిని సిక్సర్‌గా మలిచే అవకాశం ఉంటుంది. ఫినిషర్ల నుంచి ప్రతి ఒక్కరు భారీ షాట్లు ఆశిస్తారు. అందుకు తగ్గట్లుగా ఆడుతూనే వికెట్‌ పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది’’ అని రొమారియో షెఫర్డ్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌ తరఫున సత్తా చాటుతూ
కాగా 1994లో గయానాలో జన్మించిన రొమారియో షెఫర్డ్‌ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. 2019లో వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేశాడు. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి పవర్‌ హిట్టర్‌గా పేరొందాడు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 31 వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌. విండీస్‌ తరఫున వన్డేల్లో 400 పరుగులు చేయడంతో పాటు 27 వికెట్లు పడగొట్టిన రొమారియో షెఫర్డ్‌.. టీ20లలో 317 రన్స్‌ చేసి 37 వికెట్లు తీశాడు.

ఆరంభంలో భారీ ధరకు అమ్ముడుపోయి.. ఇప్పుడిలా
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన రొమారియో షెఫర్డ్‌ను 2022 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 7.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, తర్వాత అతడిని ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేయగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. కానీ ఐపీఎల్‌-2024కు ముందు లక్నో నుంచి ముంబై ఇండియన్స్‌ రొమారియో షెఫర్డ్‌ను రూ. 50 లక్షల ధరకు ట్రేడ్‌ చేసుకుంది.


PC: MI

ఇక ఇప్పటి వరకు ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రొమారియో షెఫర్డ్‌ 58 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్‌ 2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: IPL 2024: షెడ్యూల్‌, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు

Advertisement
Advertisement