WC 2023: ఆరు... భారత్‌ జోరు... ఎదురులేని టీమిండియా | India Vs England Highlights, ICC ODI World Cup 2023: India Beat England By 100 Runs - Sakshi
Sakshi News home page

WC 2023: ఆరు... భారత్‌ జోరు... ఎదురులేని టీమిండియా

Published Mon, Oct 30 2023 1:26 AM | Last Updated on Mon, Oct 30 2023 10:42 AM

Sixth win in a row for Team India - Sakshi

ఆరో పోరులోనూ భారత్‌ అదరగొట్టింది. ఎదురులేని ఆటతో  దూసుకుపోతున్న జట్టు మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని స్థితికి ఇంగ్లండ్‌ను నెడుతూ సంపూర్ణ ఆధిపత్యంతో మరో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

గత ఐదు మ్యాచ్‌లలో ఛేదనలో లక్ష్యం చేరిన టీమిండియా ఈసారి ముందుగా బ్యాటింగ్‌ చేసి తమ బలాన్ని ప్రదర్శించింది. పరుగులు సాధించేందుకు కాస్త ఇబ్బందిగా కనిపించిన పిచ్‌పై కొంత తడబడినా... 229 స్కోరు కూడా టీమిండియా గెలిచేందుకు సరిపోయింది. పట్టుదలతో కూడిన బ్యాటింగ్‌తో రోహిత్‌ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా... బౌలింగ్‌లో బుమ్రా, షమీ, కుల్దీప్‌ చెలరేగి ఇంగ్లండ్‌  పని పట్టడంతో భారత్‌ సెమీస్‌ చేరడం దాదాపు ఖాయమైంది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆపై వరుస ఓటములతో దిగాలు పడి ఈ మ్యాచ్‌ బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ మళ్లీ అదే పేలవ ఆటను కనబర్చింది. ఈ టోరీ్నలో దాదాపుగా ఆ జట్టు ఆట ముగిసినట్లే.

గత మ్యాచ్‌లకంటే మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శనతో భారత్‌లాంటి పటిష్ట జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసినప్పుడు ఇంగ్లండ్‌ విజయంపై ఆశలు రేగాయి. ఆ టీమ్‌ కోలుకునేందుకు ఇదే సరైన మ్యాచేమో అనిపించింది.

కానీ కనీసం ఓనమాలు తెలియని రీతిలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఘోరంగా ఆడి మరో 15 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను అప్పగించేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయంటే మన బౌలింగ్‌ పదును, ఇంగ్లండ్‌ చెత్త బ్యాటింగ్‌ ఏమి అర్థమవుతుంది.   

లక్నో: సొంతగడ్డపై వరల్డ్‌కప్‌లో భారత జట్టు అసాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. టైటిల్‌ వేటలో ఒక్క ఓటమీ లేకుండా వెళుతున్న రోహిత్‌ సేన ఆరో మ్యాచ్‌లోనూ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 100 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో చక్కటి ప్రదర్శనతో జట్టును ఆదుకోగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ఇంగ్లండ్‌ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. లివింగ్‌స్టోన్‌ (27)దే అత్యధిక స్కోరు కాగా... మొహమ్మద్‌ షమీ (4/22), బుమ్రా (3/32) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేశారు. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం ముంబైలో శ్రీలంకతో  తలపడుతుంది.  



కీలక భాగస్వామ్యం... 
విల్లీ వేసిన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్‌’గా ఆడిన రోహిత్‌ అతని తర్వాతి ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో దూకుడు ప్రదర్శించాడు. అయితే మరో ఎండ్‌లో భారత్‌ 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. గిల్‌ (9)ను వోక్స్‌ అవుట్‌ చేయగా, అతని బౌలింగ్‌లోనే అయ్యర్‌ (4) చెత్త షాట్‌ ఆడి నిష్క్రమించాడు. ఈ రెండు వికెట్ల మధ్య విల్లీ బౌలింగ్‌లో కోహ్లి (0) డకౌట్‌ కావడంతో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది.

ఎనిమిది బంతుల పాటు పరుగు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన  అనంతరం సహనం కోల్పోయిన విరాట్‌ ముందుకొచ్చే ఆడే క్రమంలో సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో స్కోరు 40/3కి చేరింది. ఈ దశలో రోహిత్, రాహుల్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.  బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తున్న కఠినమైన పిచ్‌పై వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. 33 పరుగుల వద్ద రోహిత్‌ను వుడ్‌ ఎల్బీగా దొరికిపోయినా...రివ్యూలో అతను బతికిపోయాడు. అనంతరం 66 బంతుల్లో రోహిత్‌ అర్ధ సెంచరీ పూర్తయింది.

నాలుగో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91  పరుగులు జోడించిన తర్వాత రాహుల్‌ను అవుట్‌ చేసిన ఇంగ్లండ్‌ ఈ జోడీని విడదీసింది. కొద్ది సేపటికి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో రోహిత్‌ కూడా వెనుదిరగ్గా... లోయర్‌ ఆర్డర్‌ ప్రభావం చూపలేకపోయింది. అయితే సూర్యకుమార్‌ కొన్ని చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించగలిగాడు.  

టపటపా... 
సిరాజ్‌ ఓవర్లో మలాన్‌ (16) వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టడంతో ఇంగ్లండ్‌ ఛేదన జోరుగా మొదలైంది. 4.4 ఓవర్లలో స్కోరు 30/0కు చేరింది. కానీ ఇక్కడి నుంచే భారత బౌలర్లు చెలరేగడంతో మొదలైన ఇంగ్లండ్‌ పతనం చివరి వరకు వేగంగా సాగింది. బుమ్రా వరుస బంతుల్లో మలాన్, రూట్‌ (0)లను వెనక్కి పంపి ప్రత్యర్థి పని పట్టాడు. ఆ తర్వాత షమీ తన వరుస ఓవర్లలో అద్భుత బంతులతో స్టోక్స్‌ (0), బెయిర్‌స్టో (14)లను బౌల్డ్‌ చేయగా... కుల్దీప్‌ వేసిన బంతి అనూహ్యంగా టర్న్‌ అయి బట్లర్‌ (10) స్టంప్స్‌ను పడగొట్టింది. ఈ వికెట్‌తో 15.1 ఓవర్లు ముగిసేసరికే ఇంగ్లండ్‌ పోరాటం దాదాపుగా ముగిసింది. తర్వాతి వరుస బ్యాటర్లకు తమ జట్టును గెలిపించేంత శక్తి లేకపోయింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) రషీద్‌ 87; గిల్‌ (బి) వోక్స్‌ 9; కోహ్లి (సి) స్టోక్స్‌ (బి) విల్లీ 0; అయ్యర్‌ (సి) వుడ్‌ (బి) వోక్స్‌ 4; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) విల్లీ 39; సూర్యకుమార్‌ (సి) వోక్స్‌ (బి) విల్లీ 49; జడేజా (ఎల్బీ) (బి) రషీద్‌ 8; షమీ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 1; బుమ్రా (రనౌట్‌) 16; కుల్దీప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1–26, 2–27, 3–40, 4–131, 5–164, 6–182, 7–183, 8–208, 9–229. 
బౌలింగ్‌: విల్లీ 10–2–45–3, వోక్స్‌ 9–1–33–2, రషీద్‌ 10–0–35–2, వుడ్‌ 9–1–46–1, లివింగ్‌స్టోన్‌ 4–1–29–0, అలీ 8–0–37–0.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (బి) షమీ 14; మలాన్‌ (బి) బుమ్రా 16; రూట్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; స్టోక్స్‌ (బి) షమీ 0; బట్లర్‌ (బి) కుల్దీప్‌ 10; మొయిన్‌ అలీ (సి) రాహుల్‌ (బి) షమీ 15; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 27; వోక్స్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 10; విల్లీ (నాటౌట్‌) 16; రషీద్‌ (బి) షమీ 13; వుడ్‌ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్‌) 129. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–33, 4–39, 5–52, 6–81, 7–98, 8–98, 9–122, 10–129. బౌలింగ్‌: బుమ్రా 6.5–1–32–3, సిరాజ్‌ 6–0–33–0, షమీ 7–2–22–4, కుల్దీప్‌ 8–0–24–2, జడేజా 7–1–16–1.    


 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి తొలిసారి ‘డకౌట్‌’ అయ్యా డు. వరుసగా నాలుగో ప్రపంచకప్‌ ఆడుతున్న కోహ్లి ఇప్పటివరకు ఈ టోర్నీ చరిత్రలో 32 మ్యాచ్‌లు ఆడి 1,384 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  

 ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 87 పరుగులు చేసిన క్రమంలో రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లి ఉన్నారు. 

100  అంతర్జాతీయ క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల్లో (మూడు ఫార్మాట్‌లు కలిపి) కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడో భారతీయ కెపె్టన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. రోహిత్‌కంటే ముందు ధోని, అజహరుద్దీన్, కోహ్లి, గంగూలీ, కపిల్‌ దేవ్, రాహుల్‌ ద్రవిడ్‌ ఈ ఘనత సాధించారు. రోహిత్‌ సారథ్యంలో 100 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 74 మ్యాచ్‌ల్లో విజయం అందుకుంది.   

ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక X అఫ్గానిస్తాన్‌
వేదిక: పుణే
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement