దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం
నెల్లూరు(క్రైమ్): పోలీస్ కానిస్టేబుళ్ల అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం నెల్లూఉలోని పోలీసు కవాతు మైదానంలో ప్రారంభమయ్యాయి. ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు చలిని లెక్క చేయకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసు కవాతు మైదానానికి చేరుకున్నారు. వారి కాల్‌లెటర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతించారు. విద్యార్హతలు, రిజర్వేషన్, వయో ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లను పరిశీలించారు. అధునాతన సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఎక్విప్‌మెంట్స్‌ను వినియోగించి అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలు నమోదు చేశారు. అందులో అర్హత సాధించిన వారికి ముందుగా 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. దీనిని నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసిన అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్ నిర్వహించారు. ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారి ఒరిజినల్ సర్టి ఫికెట్లను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసి ఉత్తీర్ణులైనట్లు పత్రాలను అందజేశారు. తొలిరోజు 600 మందికి గానూ 302 మంది గైర్హాజరయ్యారు. పరుగు పందెంలో గాయపడిన వారికి సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేయించారు.
ఎస్పీ పర్యవేక్షణలో..
దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవతకవకలు జరగకుండా ఎస్పీ జి.కృష్ణకాంత్ పటిష్ట చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజామున కవాతు మైదానానికి చేరుకున్న ఆయన పరీక్షలు ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన మొదలు అన్ని విభాగాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళా అభ్యర్థులకు జనవరి 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రిక్రూట్‌మెంట్‌లో సహాయం చేస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి మోసగించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెల్లవారుజామునే కవాతు
మైదానానికి చేరుకున్న అభ్యర్థులు
302 మంది గైర్హాజరు
పర్యవేక్షించిన ఎస్పీ కృష్ణకాంత్
Comments
Please login to add a commentAdd a comment