3వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ
బత్తలపల్లి: మండలంలోని కోడేకండ్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కోడేకండ్ల ప్రాథమిక పాఠశాలలో 19 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. వీరికి గత ప్రభుత్వంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చాక సర్ధుబాటు పేరుతో ఒక ఉపాధ్యాయురాలిని ఇక్కడ ఉంచి, మరోకరిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేశారు. దీంతో అన్ని తరగతులకు సంబంధించి 19 మంది విద్యార్థులకు సునీత అనే ఉపాధ్యాయురాలు బోధన చేస్తోంది. గురువారం టీచర్ సెలవు పెట్టడంతో ఎంఈఓ ఆదేశాల మేరకు డి.చెర్లోపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తిప్పేస్వామి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. మూడవ తరగతి చదువుతున్న బాలుడిపై మరో విద్యార్థి రాళ్లతో దాడి చేశాడు. దీంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయమైంది. స్థానికుల సాయంతో ఉపాధ్యాయుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి ఎడమ చేతి వేళ్లు తొలగించాల్సి వస్తుందని తెలిపారు. కాగా, పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని గ్రామస్తులు తెలిపినా ఎంఈఓ పట్టించుకోలేదని, దీంతో సరైన పర్యవేక్షణ లేక ఈ పరిస్థితికి దారి తీసిందంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
వ్యాపారి ఆత్మహత్య
అనంతపురం: వ్యాపారంలో నష్టాలు రావడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం యాదాలంకపల్లికి చెందిన సోమశేఖర్(40) కుటుంబంతో సహ వలస వచ్చి అనంతపురం – ధర్మవరం మార్గంలోని పంగల్ రోడ్డు వద్ద హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగక పోవడంతో అప్పుల భారం పెరిగింది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సోమశేఖర్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోలుకున్న అనంతరం గురువారం ఉదయం వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి పిలుచుకొచ్చారు. సాయంత్రం బయటకు వెళ్లివస్తానంటూ ఇంట్లో చెప్పి వచ్చిన సోమశేఖర్ నేరుగా పాలిటెక్నిక్ కళాశాలోని క్రికెట్ గ్రౌండ్ వెనుక ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని, ఉరికి వేలాడుతున్న సోమశేఖర్‌ను కిందకు దించి ప్రభుత్వా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment