ముగ్గు.. ముచ్చట
ముంగిట మెరిసే ముత్యాల ముగ్గు ధనుర్మాసానికి ప్రతీక. పన్నెండు చుక్కల చక్కటి ముగ్గు వైకుంఠ ద్వారాలకు సూచిక. గుమ్మడికాయ ముగ్గు నెలగంటు వేయాలని చెప్పే వీచిక. రథం ముగ్గు సూరీడికి స్వాగత గీతిక. ఒక్కో ముగ్గుకు ఒక్కో ముచ్చట ఉంటుంది. రంగవల్లులు కేవలం సరదా మాత్రమే కాదు.. మన సంప్రదాయం కూడా.
శ్రీకాకుళం కల్చరల్:
ధనుర్మాసం, ముగ్గుల పోటీలు, సంక్రాంతి.. అచ్చమైన తెలుగు పల్లెలకు జన్మదిన వేడుకల్లాంటివి. ధనుర్మాసం ప్రారంభం నుంచి రకరకాల పేర్ల తో ముగ్గులను ముంగిట వేయడం సంప్రదాయంగా వస్తోంది. గీతల కొద్దీ నైపుణ్యం తెలుస్తుంది. నైపుణ్యమే కాదు కాస్తో కూస్తో పుణ్యం కూడా మిళితమై ఉంటుంది. ఈ ముగ్గు క్రిమికీటకాదులకు ఆహారం కూడా కదా. ముగ్గులో కనిపించే పద్మం మహాలక్ష్మికి ప్రతీక. శుభానికి సంకేతం స్వస్తిక్, దీన్ని వినాయకుని రూపంగా కూడా భావిస్తారు. సూర్యభగవానునికి గుర్తుగా రథం ముగ్గులు.. ఇలా రకరకాల ముగ్గులు వేస్తున్నారు. హరిదాసు బొమ్మలు వేయడం, కుండతో పొంగలి ప్రసాదం, చెరకు వంటి బొమ్మలు వేసి మన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రంగవల్లికలను దిద్దుతున్నారు.
ముఖ్యమైన ముగ్గులు ఇవే
సంక్రాంతికి ముఖ్యమైన ముగ్గులు కొన్ని ఉన్నాయి. ఈ ముగ్గులు సంక్రాంతి పురుషుడిని ఆహ్వానించడం కోసం కూడా వేస్తారు. 12 ద్వారాల ముగ్గులు వేస్తారు. దీని ద్వారా వైకుంఠ ద్వారాలు తెరచినట్లుగా అర్థం వస్తుంది. మన పితృదేవతలు వైకుంఠానికి వెళ్లడానికి మార్గమని చెబుతారు. ఈ ముగ్గు కేవలం సంక్రాంతి రోజున మాత్రమే వేస్తారు.
● గుమ్మడికాయ ఆకారంలో వేసే ముగ్గు నెలగంటు నుంచి ధనుర్మాసం అంతా పెడతారు.
● రథం ముగ్గు మూడురోజుల పాటు పండగలను చేసుకొని సంక్రాంతి(పండుగ) పురుషుడిని ఆనందంగా సాగనంపేందుకు సూచికంగా వేస్తా రు. రథం తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు. ఇది సహజీవనానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ ముగ్గును కనుమ నాడు, ముక్కనుమ నాడు కూడా వేస్తారు. మకర సంక్రాంతి నుంచి సూర్యరశ్మిలో వేడిమి పెరిగి మంచు తొలగుతుంది. ఇన్ని రోజుల పాటు తీవ్రమైన చలిని ఎదుర్కొన్న ప్రజలు సూర్యుని ఆ హ్వానిస్తూ ఈ రథం ముగ్గును వేస్తారు.
కల్లాపితో వ్యాధులు దూరం..
మకర సంక్రాంతిలో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారు జామున ఆవుపేడతో వాకిలిలో కల్లాపి చల్లి ముగ్గు లు వేస్తారు. ముగ్గుల మధ్య పేడతో గొబ్బెమ్మలు పెట్టి పూలు పెడతారు. వీటి వల్ల క్రిమికీటకాలు, వ్యాధులు దూరమవుతాయి. ఈ ముగ్గుని వరిపిండితో ముగ్గుపిండిని కలిపి వేస్తారు. దీని వల్ల చిన్నచిన్న జీవులైన చీమలకు ఆహారం అందించినట్లుగా భావిస్తారు.
ద్వారాల ముగ్గు
వైకుంఠ ద్వారాల ముగ్గు
ధనుర్మాస సందడి
ధనుర్మాసంలో సంస్కృతి
సంప్రదాయాలకు పెద్దపీట
ముంగిట మెరుస్తున్న ముగ్గులు
Comments
Please login to add a commentAdd a comment