ముగిసిన విద్యా వైజ్ఞానిక మేళా
కోదాడ: కోదాడలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రెండో రోజైన శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఇందులో 312 ప్రాజెక్టులతోపాటు ఇన్‌స్పైర్‌కు ఎంపికై న 84 ఎగ్జిబిట్లతో కలిపి మొత్తం 396 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రాజెక్టులను తిలకించడానికి వేలాది మంది విద్యార్థులు తరలిరావడంతో పాఠశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ముగింపు కార్యక్రమానికి
హాజరుకాని ముఖ్యఅతిథులు
సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రావాల్సి ఉండగా ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ వచ్చారు. ఇక ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి వస్తారని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ వీరెవరూ హాజరుకాలేదు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు ఇవే..
ఆహారం–ఆరోగ్యం పరిశుభ్రత విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ అమీనాబాద్ విద్యార్థి ఎం.శాంతి, రవాణా, కమ్యునికేషన్ విభాగంలో ఎంఎస్‌ఆర్ సెంట్రల్ స్కూల్ సూర్యాపేట విద్యార్థి కొల్లు మహీధర్, సంప్రదాయ వ్యవసాయం విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ జాజిరెడ్డిగూడెం విద్యార్థులు రేణుక, చందన ప్రదర్శించిన ప్రాజెక్టులు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. అలాగే, ప్రకృతి వైపరీత్యాల విభాగంలో ఎంఎస్‌ఆర్ సెంట్రల్ స్కూల్ సూర్యాపేట విద్యార్థి జి.సాయి అభిరామ్, గణిత మోడల్స్ విభాగంలో కోదాడలోని జయ పాఠశాల విద్యార్థులు నౌషియా, మాన్య, నీటి యాజమాన్య పద్ధతుల విభాగంలో నడిగూడెం బాలికల పాఠశాల విద్యార్థి షేక్ నజ్మీన్, పునరుత్పాదక రంగం విభాగంలో అనంతగిరి మండలం పాలవరం పాఠశాల విద్యార్థి బి.ఉదయ్ ప్రాజెక్టులు ప్రథమ స్థానాల్లో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.
ఎన్నికల ప్రచారం బంద్
ఈ సైన్స్ ఫెయిర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించడాన్ని ‘సాక్షి’ శుక్రవారం వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ప్రదర్శన నిర్వహిస్తున్న పాఠశాల ప్రాంగణంలో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో నిర్వాహకులు శుక్రవారం అప్రమత్తమై ఎన్నికల ప్రచారం బంద్ చేసినట్టు తెలుస్తోంది.
ఫ సైన్స్ ఫెయిర్‌లో 396 ఎగ్జిబిట్ల ప్రదర్శన
ఫ రెండో రోజు పోటెత్తిన విద్యార్థులు
సైన్స్‌తోనే సమగ్రాభివృద్ధి : డీఈఓ
సైన్స్‌తోనే దేశంలో సమగ్రాభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. కోదాడలోని సీసీ రెడ్డి పాఠశాలలో శుక్రవారం జరిగిన 52వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ విజయవంతం కావడానికి సహకరించిన కమిటీల సభ్యులు, ఉపాధ్యాయ సంఘాలు, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రదర్శనలో 8 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. విజేతలకు అధికారులు, నాయకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని ప్రమీల, ఎంఈఓ సలీం షరీఫ్, ఎడమకాలువ మాజీ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ కందుల కోటేశ్వరరావు, బడుగుల సైదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment