కమలదళం కార్యాచరణ ప్రణాళిక
రాష్ట్రంలో మరింత పట్టు పెంచుకునే దిశలో బీజేపీ ప్రయత్నాలు
మూడు ఎమ్మెల్సీ సీట్లలో గెలిచి బలం చాటడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో ప్రజల మద్దతును కూడగట్టి, అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే లక్ష్యసాధన దిశగా కమలదళం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లలో, అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ, నూతన సంవత్సరంలో అదే ఒరవడిని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఏడాది ప్రథమార్ధంలో సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి చేరికలుండేలా చూడటం, త్వరలో జరగనున్న గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించడం, మూడు ఎమ్మెల్సీ సీట్లలో (రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్) గెలిచి రాజకీయంగా బలాన్ని చాటడం అనే లక్ష్యాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్దేశించుకుంది.
ఎంపీ ఎన్నికల్లో పడిన ఓట్లే ఆలంబనగా..
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు 77,43,947 ఓట్లు (36 శాతం) సాధించిన నేపథ్యంలో.. ప్రజా సమస్యలపై గొంతెత్తడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో (2028 అసెంబ్లీ ఎన్నికల కల్లా) రాష్ట్రంలో అధికార సాధన దిశగా అడుగులు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ సమస్యలపై పోరాడాలని భావిస్తోంది.
జాతీయ పార్టీ అండదండలు పూర్తిస్థాయిలో ఉండడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణ కూడా ఉన్నందున.. పార్టీ దీర్ఘ, స్వల్పకాలిక లక్ష్యాల సాధన దిశగా రాష్ట్రంలోని యావత్ పార్టీ యంత్రాంగం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లోనూ తమ బలం చాటాలని బీజేపీ భావిస్తోంది.
పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తికాగా.. జనవరి నెలంతా సంస్థాగతంగా మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తిచేసుకుని, వచ్చేనెల మొదటివారం కల్లా రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
సర్కారు వైఫల్యంపై ఆందోళన కార్యక్రమాలు
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన వైఫల్యాలు, ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమల్లో వెనకడుగును ఎండగట్టేలా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే రైతు భరోసా, మహిళలు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరిట చేపట్టిన కూల్చివేతలకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, దీక్షలు, కలెక్టరేట్ల ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. 2025లోనూ వీటిని మరింత విస్తృతంగా క్షేత్రస్థాయి నుంచి చేపట్టడం ద్వారా ప్రజలకు చేరువ కావాలని భావిస్తోంది.
అదే సమయంలో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, వివిధ వర్గాల ప్రజలకు ఎదురైన చేదు అనుభవాలు, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఆ పార్టీకి మళ్లీ ప్రజల్లో ఆదరణ పెరగకుండా జాగ్రత్త వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో కలిగేలా వివిధ రూపాల్లో ప్రచార, ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment