చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం: సీఎం రేవంత్‌ | CM Revanth with industrialists in New York | Sakshi
Sakshi News home page

చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం: సీఎం రేవంత్‌

Published Wed, Aug 7 2024 5:52 AM | Last Updated on Wed, Aug 7 2024 7:03 AM

CM Revanth with industrialists in New York

అమెరికాలో ఉన్న అవకాశాలన్నీ తెలంగాణలోనూ ఉన్నాయి

రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా కొత్త పారిశ్రామిక పాలసీ

న్యూయార్క్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలోనూ ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  తెలంగాణను వ్యాపారానికి, పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు సులభతర విధానాలతో కూడిన కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందిస్తు న్నామన్నారు. 

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఒడిసి పట్టేలా కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. న్యూయార్క్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ,బయోటెక్, షిప్పింగ్‌ రంగాల్లో పేరొందిన కంపెనీలకు చెందిన చైర్‌పర్సన్లు, సీఈఓలను ఉద్దేశించి మాట్లాడారు.  

భారత భవిష్యత్తు చిరునామాగా ‘ఫ్యూచర్‌ సిటీ’
హైదరాబాద్‌లో నాలుగో నగరంగా, దేశంలోనే తొలి జీరో కార్బన్‌ సిటీగా నిర్మించ తలపెట్టిన ‘ఫ్యూచర్‌ సిటీ’ భారత భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ ఫ్యూచర్‌ సిటీ రాష్ట్ర అభివద్ధికి దోహదపడటంతో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందన్నారు. ఇందులో ఏఐ హబ్‌తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని తెలిపారు. కోవిడ్‌ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేయడం ద్వారా ప్రపంచానికి హైదరాబాద్‌ సాయం చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. 

వీలైనన్ని పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్న తాను వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నానని సీఎం తెలిపారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందన్నారు. 

ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్‌కు వస్తే అనుకూలతలు, పెట్టుబడులపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయడానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలపై సీఎం ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు

రూ.1,000 కోట్లతో స్వచ్ఛ్‌ బయో ఫ్యూయల్‌ ప్లాంట్‌ 
బయో ఫ్యూయల్స్‌ తయారీ సంస్థ స్వచ్ఛ్‌ బయో తెలంగాణలో సెకండ్‌ జనరేషన్‌ సెల్యులోసిక్‌ బయో ఫ్యూయల్‌ ప్లాంట్‌ నెలకొల్పనుంది. మొదటి దశలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ నిర్మించనుంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో స్వచ్ఛ్‌ బయో చైర్‌ పర్సన్‌ ప్రవీణ్‌ పరిపాటి ఈ మేరకు చర్చలు జరిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement