ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రత్యేక తెలంగాణ సమస్య తరహాలో సంక్లిష్టంగా వర్గీకరణ
గ్లోబల్ మాదిగ డే–2024లో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణ అమలులో కొంత ఆలస్యం కావచ్చు కానీ.. తప్పక న్యాయం చేస్తామని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని, మీకు న్యాయం చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. దీనిపై ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారని, చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వెల్లడించారని గుర్తుచేశారు.
శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగ, చమర్ ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే–2024 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించిందని చెప్పారు.
మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్య మాదిరి వర్గీకరణ సమస్య జటిలమైందని, ఇందులో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను నియ మించామని, మరో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకా శం ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఇంటెలె క్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment