దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..కాంగ్రెస్‌లో సీనియర్, కీలక నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో ఎదిగిన శ్రీధర్‌బాబు సమయోచితంగా వ్యూహాలు రచిస్తూ ముందడుగు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్న నాయకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్స్ కుంగిపోవడాన్ని కూడా తనకు పాజిటివ్‌గా అన్వయించుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ శ్రీధర్ బాబు చేసిందేమిటి? ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకూ మంథనిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ అనే టాక్ ఉండేది. కానీ, మెల్లిమెల్లిగా జంప్ జిలానీలతో పాటు.. పెద్దఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతుండటంతో.. మంథని నియోజకవర్గం ఆపరేషన్ ఆకర్ష్ లో ముందువరుసలో నిలుస్తోంది.
ఉదయం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నవాళ్లు సైతం.. ఇక్కడి పరిస్థితులు చూసి నాలుక్కర్చుకుని సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్ గూటికి మళ్లీ చేరుతుండటమే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఊరైన కాటారం మండలం ధన్వాడ సర్పంచ్ తొంబర్ల వెంకటరమణ అప్పటివరకూ కాంగ్రెస్ లో ఉండగా.. ఉదయమే ఏం జరిగిందో, ఏమోగానీ బీఆర్ఎస్ కు ఆకర్షితుడై కారెక్కెశారు. కానీ, సాయంత్రానికి ఆయనేం రియలైజయ్యారో తెలియదుగానీ.. మళ్లీ తిరిగి సొంతగూటికి చేరారు.
శ్రీధర్‌బాబు వ్యూహాల కారణంగా...ఇప్పుడు మంథని నియోజకవర్గమంతా ఏకపక్షంగా కనిపిస్తున్నదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో చేరికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ ఏక ఛత్రాధిపత్యమన్నట్టుగా ఇక్కడ జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేయడంతో పాటు.. మరోవైపు కాంగ్రెస్ కు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హవాను దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. తనకు నియోజకవర్గంలో వ్యక్తిగతంగానూ.. మరోవైపు రాష్ట్రంలో పార్టీకి కూడా కలిసివచ్చే ఓ స్కెచ్ వేశారు. అది కాస్తా సక్సెస్ అవ్వడంతో.. ఇప్పుడు శ్రీధర్ బాబు అమలు చేస్తున్న వ్యూహాలపై అటు గాంధీభవన్‌లోను..ఇటు మంథనిలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక భాగంలో పిల్లర్లు కుంగిపోవడం.. దానిపై నుంచి వేసిన అంతరాష్ట్ర బ్రిడ్జ్ పై నుంచి తెలంగాణా-మహారాష్ట్ర మధ్య రాకపోకలు స్తంభించడం.. ఈ పరిణామంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు తెరలేవడం అధికారపార్టీని ఒకింత డిఫెన్స్ లో పడేసింది. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ ప్రాజెక్ట్ కుంగిపోవడాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి.. చర్చకు పెడుతున్నాయి.
ఈ సమయంలో రెండోవిడత కాంగ్రెస్ విజయభేరి యాత్ర కోసం వచ్చిన రాహూల్ గాంధీ పర్యటనలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన అనేది షెడ్యూల్ లో లేకున్నా.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అనూహ్యంగా రాహూల్ గాంధీని మేడిగడ్డ వద్దకు సందర్శన కోసం తీసుకువచ్చి.. ఓవైపు తన కాంగ్రెస్ పార్టీకి.. వ్యక్తిగతంగా తన నియోజకవర్గంలోనే కాళేశ్వరం ఉండటంతో.. తనకూ కలిసివచ్చే విధంగా ప్లాన్ చేశారు. మొత్తంగా రాహూల్ పర్యటన నేపథ్యంలో అంబటిపల్లిలో మహిళలతో సదస్సు.. మేడిగడ్డ సందర్శనతో కాంగ్రెస్ అనుకున్నంత మైలేజీ అయితే సాధించగల్గింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం శ్రీధర్ బాబుకు కూడా ఎన్నికల సమయంలో కలిసివచ్చిందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.
మాజీ మంత్రిగా... గత ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ హవాకు మంథనిలో అడ్డుకట్ట వేసి నిల్చి గెల్చిన ఎమ్మెల్యేగా.. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ గా శ్రీధర్‌బాబుకు పార్టీలో గుర్తింపు లభించింది. తండ్రి వారసత్వాన్ని అందుకోవడంతో పాటు.. ఆ స్థాయి వ్యూహాలను కూడా అమలు చేస్తున్న నేతగా ఇప్పుడు శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలో అందరి నోళ్ళలోనూ నానుతున్నారు. అయితే శ్రీధర్ బాబు వ్యూహాలకు.. అధికార బీఆర్ఎస్ ఎలాంటి ప్రతివ్యూహాలు రచిస్తోంది.. మళ్లీ వాటికి మంథని ఎమ్మెల్యే కౌంటర్ అటాక్ ఏవిధంగా చేస్తారనే ఒక ఆసక్తికర చర్చకు జరుగుతున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment