బరితెగింపు
కూటమి నేతల
సాగునీటి సంఘాల ఎన్నికల్లో పచ్చపార్టీపై 95 శాతం మంది రైతుల వ్యతిరేకత
● అంతటా అధికార పార్టీ నేతలకు తలొగ్గిన అధికారులు ● ఆఖరికి అభ్యర్థులూ కరువైనా అయినా ఆగని ప్రలోభాలు, కుట్రలు ● గిద్దలూరులో ఎన్నికల ప్రక్రియ నిలిపేసిన అధికారులు ● ఎందుకు నిర్వహించలేదో చెప్పాలంటూ తిరగబడిన రైతన్నలు
రైతుల నిరసన..
సైదాపురం : సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. వారికి అధికారులు పూర్తి మద్దతుగా నిలవడంతో బలం లేని ప్రాంతాల్లోనూ తమ వారిని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేకపోయినా కుట్రలు చేశారు. దౌర్జన్యాలకు దిగారు. విషయం తెలుసుకున్న రైతులు ఎదురు తిరిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని పట్టుబట్టారు. 95 శాతం బలం ఉన్న మద్దతుదారులను విజేతలుగా ప్రకటించేందుకు ఇష్టం లేక ఎన్నికలను పూర్తి చేయకుండానే అధికారులు, కూటమి నేతలు వెనుతిరిగారు.
గిద్దలూరులో పరాకాష్ట..
సైదాపురం మండలం గిద్దలూరు సాగునీటి సంఘాలకు శనివారం ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. పెద్దచెరువు ఆయకట్టు కింద 223 మంది రైతులు, కొత్తచెరువు ఆయకట్టు కింద 147 మంది రైతులు ఓటర్లుగా ఉన్నారు. గిద్దలూరుకు చెందిన రైతు కంభం విజయభాస్కర్‌రెడ్డి తన అనుచరులతో నామినేషన్లు వేయించారు. అందులో కూడా పెద్దచెరువుకు ఆరుగురు డైరెక్టర్ల స్థానాలకు ఆయన చెప్పిన వారే నామినేషన్ వేశారు. కూటమికి సంబంధించి ఒక్కరూ లేకపోవడంతో నేతలు తలలు పట్టుకున్నారు. కొత్త చెరువుకు ఆరు డైరెక్టర్ల పదవులకు 5 నుంచి 15 మంది రైతులు మాత్రమే కూటమి నేతలకు మద్దతు తెలిపారు. మిగిలిన 132 మంది రైతులు కంభం విజయభాస్కర్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో ఎన్నికలను వాయిదా వేయడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు. తమ రైతులకు ఓటు హక్కు ఇవ్వలేదంటూ టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అర్హత లేని ఇద్దరు ముగ్గురు చోటా నేతలను రంగంలోకి దించి ఎన్నికలు నిలిపివేసేలా కుట్రలు చేశారు. ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. దీంతో ఎన్నికల అధికారి అశోక్ కుమార్ ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని తిరుగుముఖం పట్టారు. పెద్దచెరువుకు ఆరుగురు డైరెక్టర్లు నామినేషన్ వేసి అధ్యక్షుడిగా కంభం నిలబెట్టిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉండగా అధికారి అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎన్నికలు నిర్వహించకుండా వెళ్తున్న అధికారిని ఓ వర్గానికి మద్దతుగా నిలిచిన 300 మంది రైతులు నిలదీస్తూ నిరసనకు దిగారు. ఎన్నికల ప్రక్రియ ఎందుకు పూర్తి చేయలేదో రాతపూర్వకంగా తెలపాలని పట్టుబట్టారు. ఇరువర్గాల వివాదం కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నాం అంటూ ఆయన రాసి ఇవ్వడం కొసమెరుపు. అధికారులు, కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేశారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రైతు కంభం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తమకు 95 శాతం మంది రైతులు మద్దతు పలకడంతో టీడీపీ నేతలు కుట్రలు పన్నారని, కనీసం నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులు లేక ఎన్నికలను నిలిపి వేయించారని దుయ్యబట్టారు. రెండు సాగునీటి సంఘాల అభ్యర్థులుగా పలువురు రైతులు విజయం సాధిస్తారని తెలుసుకుని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించడం వారి దమన నీతికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment