అటానమస్ హోదాలో తొలి అడుగు
● నేటి నుంచి టీటీడీ డిగ్రీ కళాశాలల్లో ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ● అటానమస్ హోదాలో తొలిసారి పరీక్షలు రాయనున్న 3 వేల మంది విద్యార్థులు ● ఎస్వీ ఆర్ట్స్, ఎస్‌జీఎస్, ఎస్పీడబ్ల్యూ కళాశాలల్లో ఏర్పాట్లు ● పరీక్షలు సజావుగా సాగేందుకు సర్వం సిద్ధం చేసిన కళాశాలల సిబ్బంది
తిరుపతి సిటీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాలో తొలి అడుగు వేయనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అటానమస్ హోదా సాధించిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్, పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలు తొలిసారి ప్రత్యేక హోదాలో తొలి పరీక్షకు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు బీఏ, బీకాం, బీఎస్సీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తొలి సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు టీటీడీ విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలి పరీక్షకు 3వేల మంది విద్యార్థులు
స్వయం ప్రతిపత్తి హోదా సాధించిన టీటీడీ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభం కానున్న డిగ్రీ తొలి ఏడాది తొలి సెమిస్టర్ పరీక్షకు సుమారు 3వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం టీటీడీ జేఈఓ, డీఈఓ ఆదేశాల మేరకు ఆయా కళాశాల ప్రిన్సిపల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ నియమించారు. ప్రశ్నపత్రాల తయారీలో కూడా పటిష్టమైన నిబంధనలను పాటిస్తూ ఎగ్జామినేషన్ ప్యానల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేశారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాలకు సంబంధించిన ప్రశ్నపత్నాల్లో ఎటువంటి తప్పిదాలు దొర్లకుండా ఒక్కో కళాశాలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment