ఓపెన్ వర్సిటీ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వండి
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిలిపివేసిన యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు వచ్చే ఏడాది నుంచి అనుమతులు ఇవ్వాలని విద్యార్థులు, అధ్యాపకులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఆదివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టడీ సెంటర్ వద్ద ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఏడాదిగా అడ్మిషన్లు నిలిపివేశారన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉన్న అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలమంది పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని మౌళిక సదుపాయాలు ఉన్న సెంటర్లలో జనవరి నుంచి అడ్మిషన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి ప్రవేశాలు ఆశిస్తున్న విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment