సంక్రాంతికి ఆర్టీసీ 230 ప్రత్యేక సర్వీసులు
తిరుపతి అర్బన్: వచ్చే సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(డీసీటీఎం) విశ్వనాథం తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 11 డిపోల నుంచి ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను జనవరి 9 నుంచి 17 వరకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎక్స్‌ప్రెస్‌లు, అల్ట్రాడీలక్స్‌లు, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, అమరావతి తదితర 230 సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, చైన్నెతోపాటు గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతికి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం లేదని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. ఆ మేరకు కండీషన్‌లో ఉండే సర్వీసులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రత్యేక సర్వీసుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు.
నేడు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీదారులు మీ సమస్యలను అధికారులకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కానున్నారు. అలాగే అన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారులు హాజరు కావడంతో పాటు సమయపాలన పాటిస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు అర్జీదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 72,411 మంది స్వామివారిని దర్శించుకోగా, 27,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ఉప విచారణ కార్యాలయం ప్రారంభం
తిరుమల: శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులు తిరుమలలో సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈఓ జె.శ్యామలరావు తెలియజేశారు. ఆదివారం ఆయన తిరుమలలోని గరుడాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యతో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాల వద్ద సర్వే చేసి మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తిరుమలలోని 42 ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గదుల కరెంట్ బుకింగ్‌లో కేంద్రీయ విచారణ కార్యాలయంపై అధిక భారం పడుతుండడంతో గదుల కేటాయింపు ప్రక్రియను వికేంద్రీకరించినట్లు చెప్పారు. ఉప విచారణ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపు డ్రాగన్ బోట్ రాష్ట్ర జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీ కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 9గంటలకు డ్రాగన్ బోట్ (పడవ) రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలను తిరుపతి సమీపంలోని రాయలచెరువులో నిర్వహించనున్నారు. ఆ మేరకు తిరుపతి జిల్లా డీఎస్‌డీఓ సయ్యద్ సాహెబ్, రాష్ట్ర కెనియింగ్, కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరామం నాయుడు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సీ్త్ర, పురుషులకు, మిక్స్‌డ్ కేటగిరీలో 200 మీటర్ల డ్రాటన్ బోట్ స్ప్రింట్, 500 మీటర్ల డ్రాగన్ బోట్ స్ప్రింట్, 2 వేల మీటర్ల ఎండూరెన్సు రేసులో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న 13వ డ్రాగన్ బోట్ జాతీయ చాంపియన్‌షిప్ పోటీలకు ఈ మూడు విభాగాల్లో ప్రతిభ చాటిన వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 95420 34270 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment