ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
తిరుపతి మంగళం : ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టాస్క్‌ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, నమోదైన కేసులను నిరూపించే విధంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లర్‌గా 8 కేసుల్లో నిందితుడైన వైఎస్సార్ కడప జిల్లా, చాపాడు మండలం ఖాదర్‌వల్లి గ్రామానికి చెందిన ఫకృవల్లి కుమారుడు షేక్ చంపతి జాకీర్ (30)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈరోజు నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ స్మగ్లర్ విలువైన ఎర్రచందనాన్ని కొల్లగొడుతూ అటవీ, వన్యమృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడుతుండడంతో ఇతనిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు అమలు చేస్తూ కోర్టు ఆదేశాల మేరకు కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా స్మగ్లర్లపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనకాడమని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. అటవీ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, అరుదైన వృక్ష సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment