ఆదర్శ తిరుమలే లక్ష్యం
● గత ఆర్నెళ్లలో నాణ్యమైన అన్న, లడ్డూ ప్రసాదాల పంపిణీ ● చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారితటీటీడీ చాట్‌బాట్ అభివృద్ధికి ప్రయత్నం ● ఈఓ శ్యామలరావు
తిరుమల: తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్–2047 లక్ష్యమని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అన్నారు. తిరుమలలో గత ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గత ఆర్నెళ్లలో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిన రూ.70 లక్షల పరికరాలతో టీటీడీ సొంతంగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు ఈఓ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు వారి సొంత పేర్లను తొలగించి, ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. స్వర్ణాంధ్ర విజన్–2047కు అనుగుణంగా తిరుమల విజన్‌న్–2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు. తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2019 తుడా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తిరుమల జోనల్ ప్లాన్‌ను తయారు చేసినట్టు తెలిపారు. అయితే 2017 సంవత్సరం సమాచారం ఆధారంగా చేసిన ప్రతిపాదనలను ఆధునీకరించామన్నారు. దేశంలోనే ఇతర ఆలయాలకు ఆదర్శవంతంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, సుమారు 18 ప్రాజెక్టులకు ప్రణాళికలు చేసేందుకు 9 సంపూర్ణ నివేదికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
● తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్‌వేల నిర్మాణం, రామ్‌భగీచ, బాలాజీ బస్టాండ్‌ల పునర్నిర్మాణం
● భక్తులకు వసతి కోసం అలిపిరి దగ్గర 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భవనాల రూపకల్పన
● టీటీడీలో ఉన్న 31 మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా వీఆర్‌ఎస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం మేరకు చర్యలు
● తిరుమలలో రోడ్లను ఆక్రమిస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హాకర్ లైసెన్సుదారులు, అనధికార తట్టలపై కఠిన చర్యలు
● తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌళిక సదుపాయాలు, మాడవీధుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు
● సనాతన హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి. ప్రభుత్వ సలహాదారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు సహకారంతో యువతలో ఆధ్యాత్మికత పెంచేలా చర్యలు
● ఇప్పటి వరకు చేపట్టిన హెడీపీపీ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ్గా కార్యక్రమాలు నిర్వహణ
● తిరుమలలోని ప్రైవేట్ క్యాంటీన్లలో ధరలు నియంత్రించి, పేరొందిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు
● తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు, వర్షపు నీరు, మురుగు నీరు వేర్వేరుగా వెళ్లేలా డ్రెయిన్ల నిర్మాణం
● సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం, వసతి అందించేలా చర్యలు
● చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్‌బాట్ అభివృద్ధికి ప్రయత్నం
● గతంలో ఉన్న వ్యవస్థాపరమైన లోపాలను అడ్డుపెట్టుకుని భక్తులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు. ఎప్పటికప్పుడు పోలీసులు, విజిలెన్స్‌శాఖ సహకారంతో దళారుల నియంత్రణ
● టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న 61 ఆలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల
విజన్–2047 లక్ష్యాలు
Comments
Please login to add a commentAdd a comment