మాతమ్మా.. రాజకీయ రగడ ఏందమ్మా?
రేణిగుంట: శ్రీకాళహస్తి మండలం, కమ్మకొత్తూరు అరుంధతీవాడ, దళితవాడ గ్రామస్థుల మధ్య మాతమ్మ ఆలయ స్థల వివాదం సోమవారం తెరమీదకు వచ్చింది. టీడీపీ అనుచరులు దౌర్జన్యంగా ఆలయ ఫెన్సింగ్ రాళ్లను తొలగించారు. స్థానికుల కథనం.. కమ్మకొత్తూరు అరుంధతీవాడ శివారున మాతమ్మ ఆలయానికి పొంగళ్లు పెట్టుకునేందుకు 17.5 సెంట్లు స్థలం ఉంది. ఈ స్థలాన్ని అరుంధతీవాడ వాసులు కొన్నేళ్ల కిందట సుబ్రమణ్యంశెట్టి నుంచి విక్రయించి భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు వినియోగిస్తున్నారు. అయితే ఈ మార్గంలో దళితవాడకు దారి వదలాలని రెండు కాలనీల మధ్య వివాదం నడుస్తోంది.
దళితుల మధ్య చిచ్చుపెట్టిన
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పీఏ
ఎమ్మెల్యే పీఏ అండతో..
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పీఏ శ్రీనివాసులునాయుడు ఈ వివాదాన్ని రాజకీయంగా మార్చారు. దళితవాడ వాసులను రెచ్చగొట్టి సోమవారం వారితో కలసి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఫెన్సింగ్ రాళ్లను కూల్చివేశారు. దీంతో అరుంధతీవాడ వాసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పీఏతోపాటు డీ.రమేష్‌నాయుడు, చిరంజీవినాయుడు, పీ.బాబునాయుడు, ఎస్సీ కాలనీకి చెందిన వీరయ్య, బాలగురవయ్య, రాధామణిగున్నయ్య, శంకర్, క్రిష్ణయ్య కలసి అరుంధతీవాడవాసులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్థిచెప్పారు. తర్వాత అరుంధతీవాడ వాసులు సోమవారం రాత్రి శ్రీకాళహస్తిలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అన్నదమ్ములుగా ఉన్న తమ మధ్య ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసులు నాయుడు చిచ్చుపెట్టారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తమపై దాడి చేశారని అరుంధతీవాడకు చెందిన కొందరు మహిళలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment