కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట) : వైఎస్సార్ కడప జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర సైన్‌న్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేరుకున్నారు. ఆయనకు కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇమ్రాన్, పీసీ రాయులు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి రోడ్డు మార్గంలో కడపకు బయలుదేరి వెళ్లారు.
జీవాలు అపహరించిన ముఠా అరెస్ట్
సూళ్లూరుపేట రూరల్ : మండలంలోని మతకాముడి, సామంతమల్లా గ్రామాల్లో జీవాలను అపహరించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బ్రహ్మనాయుడు బుధవారం తెలిపారు. వివరాలు.. సీఐ మురళీకృష్ణకు అందిన సమాచారం మేరకు..ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తన సిబ్బందితో మంగళవారం చెంగాళమ్మ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను తరలిస్తున్న ఓ వాహనం వచ్చింది. అందులోని వ్యక్తులను విచారించడంతో అసలు విషయం బయట పడింది. 43 గొర్రెలు, మూడు పొట్టేళ్లు, రెండు మేకపోతులు, 4 పొట్టేలు పిల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.6.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేటలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు.
దాడిలో ఒకరికి గాయాలు
పెళ్లకూరు:మండలంలోని తాళ్వాయిపాడుకు చెందిన మల్లారపు శ్రీనివాసులును మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన ఆరుగురు దాడి చేసి గాయపరిచారు. వివరాలు.. శ్రీనివాసులుతో వెంకయ్యబాబు, చిరంజీవి, బన్నీ, ఆనంద్, రవి, వెంకటేశ్వర్లు చిన్నపాటి విషయంలో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో ఉన్న వారు మూకుమ్మడిగా శ్రీనివాసులుపై దాడి చేసి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment