ఉసురుకు ఉచ్చులు
● వన్యప్రాణుల కోసం వేటగాళ్ల ట్రాప్ ● మేత కోసం వెళ్లి చిక్కుకుంటున్న జీవాలు
చిల్లకూరు : వన్యప్రాణుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చులకు జీవాలు చిక్కుకుంటున్నాయి. మేత కోసం వెళ్లి మృత్యువాత పడుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతంలోకి జీవాలను మేపు కోసం తీసుకెళ్లాలంటేనే పెంపకందార్లు హడలిపోతున్నారు. వివరాలు.. మండలంలోని పలు చోట్ల ఎక్కువ సంఖ్యలో చుక్కల దుప్పిలు సంచరిస్తుంటాయి. అవి మేత, దాహార్తిని తీర్చుకునేందుకు గ్రామాలకు సమీపంలోకి వస్తుంటాయి. దీంతో వేటగాళ్లు ఉచ్చులు వేసి వన్యప్రాణులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని చేడిమాల పంచాయతీలోని పిడతలపూడికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులకు రెండు రోజుల్లోనే మూడు పోటేళ్లు, రెండు మేక పిల్లలు చిక్కుకుని మృతి చెందాయి. బుధవారం ఈ మేరకు జీవాల పెంపకందార్లు మాట్లాడుతూ వేటగాళ్లు ఉచ్చులు వేసిన అన్ని ప్రాంతాలను గుర్తించలేమన్నారు. తాము ఒక వైపు ఉంటే మరో వైపు జీవాలు ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాయని తెలిపారు. అయితే చేడిమాల, కమ్మవారిపాళెం, తిమ్మనగారిపాళెం సమీపంలోని వేటగాళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోందని ఆరోపించారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు చేపట్టకుంటే తమ జీవాలతోపాటు, వన్యప్రాణులు కూడా మృత్యువాత పడతాయని వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment