డబ్బులడిగినందుకు బతుకునే తన్నేశాడు!
– వలస జీవిపై దౌర్జన్యం
శ్రీకాళహస్తి: బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరొచ్చిన ఓ వలస జీవిపై దౌర్జన్యం చేశారు. పానీపూరి తిని డబ్బులు ఇవ్వకుండా ఆ బండినే కాలితో తన్ని రోడ్డుపై తోసేసి ధ్వంసం చేసి వెళ్లాడో పొగరుబోతు. ఈ ఘటన పుచ్చలపల్లి సుందరయ్య భవనం సాక్షిగా స్థానిక దక్షిణ కై లాస్ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగల్‌కు చెందిన ప్రదీప్ కుటుంబం బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని 20 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చింది. ప్రదీప్ దక్షిణ కై సలానగర్‌లో పానీపూరి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి పానీపూరి తినేందుకు ప్రదీప్ వద్దకు వచ్చాడు. తీరా పానీపూరి తిన్నాక డబ్బులు అడినందుకు బండిని కాలితో తన్ని రోడ్డుపై తోసేసి ధ్వంసం చేశాడు. తర్వాత అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో చిరువ్యాపారి బండిని దౌర్జన్యంగా తోసేయడంపై స్థానికులు, పానీపూరి ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెండవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment