నిలిచిన ఏపీజీవీబీ బ్యాంకు సేవలు
జనవరి 1 నుంచి టీజీబీ
దుద్యాల్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సేవలు ఇక నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్పు చేసినట్లు హకీంపేట్ బ్యాంకు మేనేజర్ హరీశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీజీవీబీ బ్యాంకు సేవలు మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పేరు మార్పునకు సాఫ్ట్‌వేర్ పనులు నిర్వహిస్తుండడంతో లావాదేవీలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవలు నిలిపేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ఈ నెల చివరి వరకు బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం, యూపీఐ, మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, సీఎస్‌పీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు.
నేడు హకీంపేట్‌కు తమ్మినేని
దుద్యాల్: లగచర్ల ఘటనలో రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి బుస్స చంద్రయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ భూముల కోసం పోరాటాలు చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సోమవారం నిర్వహించనున్న సభకు కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ, డీజీ నరసింహరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు హాజరవుతారని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
వేటగాళ్ల వలకు కొండ చిలువ
దౌల్తాబాద్: అడవి పందులకు వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కింది. ఈ ఘటన ఆదివారం దౌల్తాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, అటవీ అధికారులు తెలిపిన ప్రకారం.. దౌల్తాబాద్, రావులపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు వలలు వేశారు. ఆ వలలో భారీ కొండచిలువ చిక్కింది. ఉదయం గమనించిన వేటగాళ్లు పోలీసులకు సమాచారం తెలపడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తిరిగి అడవిలోనే వదిలేస్తామని చెప్పారు.
చారిత్రక ఆలయాలను కాపాడుకోవాలి
నందిగామ: చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయాలు, శిల్పాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లెచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నర్సప్పగూడ అక్కమ్మ చెరువు కట్ట కింద ఉన్న పురాతన శివాలాయాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పైన శిఖరం, బయటి గోడలు పడిపోయిన ఈ ఆలయం సుమారు 1,100 సంవత్సరాల క్రితం రాష్ట్రకూటులనే రాజులచే నిర్మింపబడి ఉంటుందని అన్నారు. అర్ధ మండపంలో కాకతీయుల కాలపు సప్తమాతృకలు, గణేశ శిల్పాలు ఉన్నాయని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఆలయాన్ని, శిల్పాలను కాపాడాలని గ్రామస్తులకు సూచించారు.
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోల్ నర్సింహులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి విఠలయ్య, యూత్ అధ్యక్షుడు సాయికుమార్, నాయకులు రాజు, అజీం, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment