లక్ష్యం.. శతశాతం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. శతశాతం

Published Mon, Feb 3 2025 6:55 AM | Last Updated on Mon, Feb 3 2025 6:55 AM

లక్ష్యం.. శతశాతం

లక్ష్యం.. శతశాతం

ఇబ్రహీంపట్నం/తుక్కుగూడ: మున్సిపాలిటీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు సమీపిస్తుండడంతో స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి టార్గెట్‌ పూర్తి చేయాలని భావిస్తోంది. మూడునాలుగేళ్లుగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గాయి. సిబ్బంది జీతభత్యాలు, అభివృద్ధి పనులకు డబ్బులు కావాలంటే భవన నిర్మాణాల అనుమతులు, బెటర్‌మెంట్‌ చార్జీలు, వాణిజ్య దుకాణాల లైసెన్స్‌ చార్జీలతోపాటు వివిధ పన్నుల రూపేనా వచ్చే ఆదాయంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పూర్తిస్థాయి పన్నులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వసూళ్లు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటికీ, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు, విద్యాసంస్థల వెంట తిరుగుతూ పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత వారికి అప్పగించారు. మొండి బకాయిదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు నోటీసులు అందజేస్తున్నారు. పన్నులు చెల్లించకుంటే ఆయా భవనాలను సీజ్‌ చేసేందుకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు.

‘పట్నం’ మున్సిపల్‌ పరిధిలో..

పన్నుల వసూళ్లలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వెనుకబడింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి టార్గెట్‌ రూ.13.09 కోట్లు కాగా అందులో పాత బకాయిలే రూ.6.55 కోట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.2.91 కోట్లు మాత్రమే రాబట్టగలిగారు. మున్సిపాలిటీలో గృహ, వాణిజ్య, వ్యాపార, విద్య, వైద్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు సంబంధించి సుమారు 7,239 భవనాలకు పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రావాల్సిన పన్నులు పక్కన పెడితే ఇతర మార్గాల ద్వారా సుమారు రూ.6 కోట్ల పన్నులు మార్చి 31 ముగిసేలోపు రాబట్టాల్సి ఉంది.

తుక్కుగూడ పరిధిలో..

మున్సిపల్‌ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్‌, ఇమామ్‌గూడ, దేవేందర్‌నగర్‌కాలనీ, సర్ధార్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో 7,098 గృహాలు, 285 వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.72 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు బిల్‌ కలెక్టర్లుకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా (52 శాతం) వసూలు చేశారు. మిగిలిన మొత్తం వసూలు చేయడానికి పుర ప్రజలకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఆటో వాహనానికి మైక్‌ ఉంచి ప్రతి వార్డులో చాటింపు వేస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి పుర ప్రజల నుంచి ఆదాయ పన్ను కాకుండా ఫ్యాబ్‌సిటీ– హార్డువేరు పార్కు, మంఖాల్‌ పారిశ్రామిక వాడ తదితర పరిశ్రమల వద్ద టీఎస్‌ఐడీఎస్‌ వసూలు చేసిన ఆదాయ పన్నులో 40 శాతం మేరకు అందజేస్తారు. గత ఏడాది 92 శాతం ఆదాయ పన్నును అధికారులు వసూలు చేశారు.

పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి

మున్సిపాల్టీల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు

టార్గెట్‌ పూర్తి చేసేందుకు చర్యలు

అవగాహన కల్పిస్తున్న అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement