● వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం
● డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో మరింత లోతుకు
● ఇప్పటికే ఆగిపోస్తున్న వ్యవసాయ మోటార్లు
● పల్లెల్లో అప్పుడే మొదలైన తాగునీటి ఎద్దడి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూగర్భజలాలు జిల్లాలో వేగంగా పడిపోతున్నాయి. గత డిసెంబర్‌లో సగటు భూగర్భ జలమట్టం ఆనవాళ్లు 9.08 మీటర్ల లోతులో కన్పించగా తాజాగా 10.13 మీటర్ల లోతుకు (1.05 మీటర్ల లోతుకు) పడిపోయాయి. వేసవి ప్రారంభానికి ముందే వ్యవసాయ బోర్లు ఆగిపోస్తుండగా గృహ, వాణిజ్య సంస్థల్లో అప్పుడే నీటికి కటకట మొదలైంది. ముఖ్యంగా నిర్మాణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 87 ఫీజో మీటర్లు ఉండగా ఇబ్రహీంపట్నంలో 15.75 మీటర్ల లోతుకు పడిపోతే.. సరూర్‌నగర్‌లో 14.80 మీటర్లు, శేరిలింగంపల్లిలో 13.97 మీటర్ల లోతుకు చేరడం గమనార్హం. ఇక నందిగామ, ఆమనగల్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో నీటి ఆనవాళ్లు ఆశించిన దానికంటే పైనే కన్పిస్తుండడం విశేషం.
పల్లెల్లో మొదలైన కటకట
చెరువులు, కుంటలు ధ్వంసం చేయడం, నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేయకపోవడం, కొండలు, గుట్టలను చదును చేస్తుండటం, చెట్లను నరికివేస్తుండటం, గేటెట్ కమ్యూనిటీలు, విల్లాలు, ఫౌంహౌస్‌లు, పరిశ్రమల పేరుతో భారీగా నిర్మాణాలు చేపడుతుండటం భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండటానికి కారణమవుతున్నాయి. ఇంటి చుట్టూ రోడ్డు, ఇతర అవసరాల కోసం కాంక్రీట్ వేస్తుండటం, వర్షపు నీరు భూమిలోపలికి ఇంకేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయకపోవడం, పంట పొలాల్లోనే కాదు గృహ, వాణిజ్య సముదాయాల్లోనూ అవసరానికి మించి నీటిని వినియోగిస్తుండడం కూడా కారణమవుతున్నాయి. గ్రామాల్లోని బోర్లు కూడా సరిగా పోయడం లేదు. అవసరాల మేరకు నీరు సరఫరా కావడం లేదు. గత నెల వరకు ప్రతి రోజూ నల్లాల్లో నీరు వచ్చేది. తాజాగా రోజు విడిచి రోజు వదులుతుండటమే ఇందుకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment