మహారాణిపేట: ‘జగనన్నకు చెబుదాం’ అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించొద్దని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన వెబ్‌సైట్‌లో నమోదైన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీని 24 గంటల్లోగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపాలన్నారు. జగనన్నకు చెబుదాం అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అర్జీదారునికి ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలన్నారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తమకు అందిన దరఖాస్తులను పూర్తిగా చదివి, ఒకవేళ అది తమ శాఖకు సంబంధించింది కానట్లయితే సంబంధిత అధికారులకు పంపాలని, ఇటువంటి దరఖాస్తులను మానిటర్ చేయాలని డీఆర్వోకి సూచించారు. జీవీఎంసీకి అర్జీలు అధికంగా వస్తున్నాయని, అర్జీలపై అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. గడువు తీరినప్పటికి వివిధ శాఖల్లో అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. సోమవారం నాటి జగనన్నకు చెబుదాం (స్పందన)కు 163 అర్జీలు అందాయి. రెవెన్యూశాఖకు 47, జీవీఎంసీకి 35, పోలీసుశాఖకు 24, ఇతర విభాగాల నుంచి 57 వినతులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహబ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment