అలరించిన భారతీయ సంప్రదాయ నృత్య ప్రదర్శన
● మిలాన్ విలేజ్, సాంకేతిక ప్రదర్శనను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ● రక్షణ రంగ ఆవిష్కరణల స్టాల్స్ సందర్శన ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విశాఖ సిటీ: అనేక దేశాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో హస్త కళలు.. వస్త్రాలు.. వంటకాలు.. దేశ రక్షణ రంగ సత్తాను చాటేలా అధునాతన యుద్ధ సామగ్రి.. మిస్సైల్స్.. టార్పిడోలు.. డ్రోన్లు.. కనులవిందు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు.. ఇలా అనేక ప్రత్యేకతలతో మిలాన్–2024 ప్రదర్శన 58 దేశాల నావికాదళాలకు చెందిన అధికారులు, ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసింది. ఒకవైపు మిలాన్ విలేజ్.. మరోవైపు రక్షణ రంగ సంస్థల ఆవిష్కరణల ప్రదర్శనను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఐఎన్‌ఎస్ శాతవాహనలో ప్రారంభించారు. ముందుగా ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సహకారంతో నిర్వహించిన మారిటైం సాంకేతిక ప్రదర్శనను కేంద్ర మంత్రి తిలకించారు. డీఆర్‌డీఓ, భారత్ డైనమిక్స్, ఇలా రక్షణ రంగ సంస్థల ఆవిష్కరణలు, వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. అనంతరం మిలాన్ విలేజ్‌లో ఇండోనేషియా, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం ఇలా పలు దేశాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అక్కడి వారి సంప్రదాయ దుస్తులు, హస్తకళలను పరిశీలించారు.
ఆకట్టుకున్న ఆవిష్కరణలు
మిలాన్ విలేజ్ సంప్రదాయాలకు అద్దం పట్టగా.. మారిటైం సాంకేతిక ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. ఒకవైపు వందల కిలోమీటర్ల దూరం నుంచి శుత్రుదేశాల స్థావరాలను తుత్తునీయలు చేసే మిసైల్స్.. మరోవైపు శుత్రువుల మిస్సైల్స్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనే యాంటీ మిస్సైల్స్ సిస్టమ్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. అలాగే భారత్ డైనమిక్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థలతో పాటు డిఫెన్స్ రంగంలో స్టార్టప్ సంస్థలు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్, దక్షా అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, సైఫ్ ఆటోమేషన్ లిమిటెడ్ ఆవిష్కరణలు భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని తేటతెల్లం చేశాయి. 58 దేశాలకు చెందిన నావికాదళాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రదర్శనను తిలకించారు. ఈ ప్రదర్శన 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మిలాన్ ప్రదర్శనకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధుల కోసం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment