అగనంపూడి: పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డి లక్ష్మీనగర్‌లోని ఒక రేకుల షెడ్డులో కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ.. హిందూజా పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ పనులు నిర్వహించే కాంట్రాక్టర్ మద్ది వెంకటరావు వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడికి రప్పించి, లక్ష్మీనగర్‌లోని రేకుల షెడ్లలో వారికి వసతి కల్పించారు. అక్కడి నుంచి రోజూ కూలీలను పనుల కోసం హిందూజా పవర్‌ప్లాంట్‌కు తీసుకువెళ్లేవారు. కాంట్రాక్ట్ పనులు ముగియడంతో కూలీలు మార్చిలో వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ రేకుల షెడ్లు ఖాళీగా ఉన్నాయి. మళ్లీ పనులు మొదలు కావడంతో కూలీలకు వసతి కల్పించేందుకు షెడ్లు, పరిసర ప్రాంతాలను శనివారం శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. అయితే ప్రహరీకి, షెడ్డుకు మధ్యలో కుళ్లిన మృతదేహాన్ని కూలీలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహంపై నీలి రంగు ట్రాక్ ప్యాంట్ మాత్రమే ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment